కూటమిలోకి రండి!
సేలం: డీఎంకేకు వ్యతిరేకంగా ఏకాభిప్రాయంతో ఉన్న పార్టీలు తమ కూటమిలోకి రావచ్చని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళనిస్వామి పిలుపు ఇచ్చారు. సంక్రాంతి ( పొంగల్)కు కుటుంబ కార్డు దారులకు రూ. 5 వేలు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివరాలు.. సేలం జిల్లా ఎడప్పాడిలోఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సోమవారం విలేకరులతో మాట్లాడారు. అన్ని రకాల ధరలు రాష్ట్రంలో అమాంతంగా పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. తాజాగా రైల్వే చార్జీలను పెంచడం భావ్యం కాదని, చార్జీలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీల గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని , ప్రతి పార్టీకి వారికంటూ అభివప్రాయాలు ఉంటాయని, ఆయా పార్టీలు ఏ శక్తి అన్నది ప్రజలే నిర్ణయిస్తారని టీవీకే నేత విజయ్ వ్యాఖ్యానించి దివ్య శక్తి వ్యాఖ్యల గురించి సందించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎంకే ప్రభుత్వం కేవలం ప్రకటనలోనే ప్రజలను మోసం చేస్తూ వస్తున్నదని, ఇచ్చిన హామీలను సక్రమంగానే అమలు చేయలేదని ఆరోపించారు. అన్నాడీఎంకే నేతృత్వంలో మేనిఫెస్టో రూపకల్పనకు త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రజా వ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న అభిప్రాయంతో ఉన్నా పార్టీలు కూటమిలోకి రావాలని పిలుపు నిచ్చారు. ఎన్నికల సమయానికి ఆయా పార్టీలు కూటమిలోకి వస్తాయని ఎదురు చూస్తున్నామన్నారు.
సక్రాంతికి రూ. 5 వేలు చొప్పున ఇవ్వాల్సిందే..
సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ఈ సారైనా కనీసం రూ. 5 వేలు నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. డీఎంకే ప్రభుత్వానికి ఇదే చివరి సంక్రాంతి అని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి కానుక రూ. 5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన సీఎం స్టాలిన్, తాజాగా ఏ విధంగా స్పందిస్తారో చూస్తామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, 125 రోజులకు పెంచడం గురించి ప్రశ్నించగా, డీఎంకే గత మేనిఫెస్టోలో 150 రోజులకు పెంచుతామన్నారే, అమలు చేశారా..? అని ప్రశ్నించారు. డీఎంకే కూటమికి పార్లమెంట్‌లో 39 మంది ఎంపీలు ఉన్నా, ప్రజాగళాన్ని, తమిళ వాణిని వినిపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆర్థిక సంక్షోభం గురించి పార్లమెంట్‌లో ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం రాష్ట్ర అప్పు రెట్టింపు అవుతూ వస్తున్నదన్నారు. ఓటరు జాబితాలో నిజమైన ఓటర్లు మాత్రమే ఉండాలని, వారే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి విజయ్ టీవీకే పార్టీని ఉద్దేశించి ఇది దివ్య శక్తి కాదని, మిశ్రమాల మేళవింపు అని ఎద్దేవా చేయడం గమనార్హం. ఈ విషయంగా టీవీకే నేత నిర్మల్‌కుమార్ స్పందిస్తూ, తాము డీఎంకేను దుష్ట శక్తి అని, తమ పార్టీ దివ్య శక్తి అని వ్యాఖ్యానిస్తూ, సమాధానం అన్నాడీఎంకే నుంచి రావడం అనుమానాలు కల్గిస్తున్నాయని వ్యాఖ్యానించారు.


