సూర్యప్రభపై చంద్రశేఖరుడి విహారం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారం ఉదయం పంచ మూర్తులను బంగారు సూర్య ప్రభ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. వివరాలు.. అరుణాచలేశ్వరాలయంలో పది రోజుల పాటు జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజరోహణంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా సోమవారం రాత్రి వినాయకుడు, చంద్రశేఖర స్వామి వారిని మాడ వీదుల్లో ఊరేగించారు. అనంతరం అధికార నంది వాహనంలో భక్తుల హరోం.... హారా.... నామ స్మరణాల మధ్య పంచమూర్తులను ఊరేగించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు పంచమూర్తులలైన వినాయకుడు , చంద్రశేఖరుడు, మురుగన్, అన్నామలైయార్, ఉన్నామలై, చండీకేశ్వరర్ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పలంకరణ చేసి దీపారదన పూజలు చేశారు. అనంతరం పంచమూర్తులకు పుష్పాలంకరణ చేసి మాడ వీధుల్లో మూసిక వాహనం, హంస వాహనం, వెండి అధికార నంది వాహనం, సింహ వాహనంలో ఊరేగించారు. ఈ ఉత్సవాల్లోని స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సరాలు ప్రారంభం కావడంతో తిరువణ్ణామలైకి భక్తులు పోటెత్తుతున్నారు.
సూర్యప్రభపై చంద్రశేఖరుడి విహారం
సూర్యప్రభపై చంద్రశేఖరుడి విహారం


