
టీఐపీతో లక్షకు పైగా సృష్టికర్తలు
సాక్షి, చైన్నె: టెక్ ఇన్ప్లుయన్సర్ ప్రోగ్రామ్(టీఐపీ)ని అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఇది పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, సాంకేతిక రంగంలో కంటెంట్ సృష్టికర్తలను శక్తివంతం చేయడానికి రూపొందించబడిందని అమెజాన్ ఇండియా క్రియేటర్స్ ప్రోగ్రామ్ హెడ్ నిధి తక్కర్ తెలిపారు. బుధవారం స్థానికంగా ఈ వివరాలను ఆమె తెలియజేశారు. అమెజాన్ బెస్ట్ ఇన్ టెక్ అవార్డులతో ఆవిష్కరించబడిన ఈ కార్యక్రమం అన్ని పరిమాణాల సృష్టికర్తలకు సాధనం, వనరు అని వివరించారు. ప్రధానంగా స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్ టాప్‌లు, కెమెరాలు, ఇతర గాడ్జెట్‌ల చుట్టూ కంటెంట్ ఉత్పత్తి చేయడానికి అవకాశాలను అందిస్తుందన్నారు. ఇది వినియోగదారులు, కంటెంట్ సృష్టికర్తల అవసరాలను తీర్చడానికి అభివృద్ధి చేశామన్నారు. వినియోగదారుల అన్వేషణ, పరిశోధనలో సృష్టికర్తలు ప్రధానపాత్ర పోషిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఫ్యాషన్, జీవన శైలి, ఫిట్‌నెస్ వంటి విభాగాలలో లక్ష మందికి పైగా సృష్టి కర్తలను చేర్చే స్థాయికి ఈ నెట్‌వర్క్ పెరిగిందని వివరించారు. ఇందులో సమీరా రెడ్డి, రాజీవ్ మఖ్ని, అంకుర్ వంటి ప్రముఖ సృష్టికర్తలు , ప్రముఖులు, నిపుణులు సైతం ఉన్నట్టు పేర్కొన్నారు.