
రూ. 12 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తులు ధ్వంసం
అన్నానగర్: చైన్నె విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న రూ.12.5 కోట్ల విలువైన అక్రమ రవాణా వస్తువులను కస్టమ్స్ అధికారులు నిప్పంటించి ధ్వంసం చేశారు. వివరాలు.. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయంలో ప్రయాణికులు అక్రమంగా తరలిస్తుంటే ఈ–సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, హెచ్చరిక లేబుల్స్ లేని సిగరెట్ లైటర్లు, మద్యం బాటిళ్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేస్తుంటారు. గతకొన్ని నెలలుగా ఇలా స్వాధీనం చేసుకున్న అక్రమ రవాణా వస్తువుల విలువ దాదాపు రూ. 12.5 కోట్లు ఉంటుందని అంచనా. ఈనేపథ్యంలో ఈవస్తువులన్నింటినీ అధికారులు బుధవారం ట్రక్కుల ద్వారా తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలోని బాయిలర్ ప్లాంట్‌కు తరలించారు. చైన్నె విమానాశ్రయ కస్టమ్స్ అధికారుల సమక్షంలో స్వచ్ఛంద సంస్థ సహాయంతో వాటిని తగలబెట్టి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.