
సూర్యతో జత కుదిరినట్టేనా?
తమిళసినిమా: అర్ధ సెంచరీ చిత్రాలకు చేరువలో ఉన్న నటుడు సూర్య. జయాపజయాలకు అతీతుడు. ఆ స్థాయికి చేరుకున్న హీరో ఈయన. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న సూర్య ప్రస్తుతం తన 45వ చిత్రం కరుప్పు షూటింగ్‌ను పూర్తి చేసి తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. లక్కీభాస్కర్ చిత్రం ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది. కాగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న కరుప్పు చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం దీపావళి రేసుకు సిద్దం అవుతోంది. ఇకపోతే సూర్య నటించే 47వ చిత్రం కూడా ఖరారు అయ్యింది. దీనికి ఆవేశం చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న మలయాళ దర్శకుడు జీతు మాదవన్ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.ధాను, 2 డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ఇందులో నటుడు సూర్య పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటించనున్నట్లు సమాచారం. ఈయన ఇంతకు ముందు నటించిన కాక్కకాక్క, సింగం సీక్వెల్స్ మంచి విజయాన్ని సాధించాయన్నది తెలిసిందే. కాగా చాలా గ్యాప్ తరువాత మరోసారి సూర్య పోలీస్ అవతారం ఎత్తడానికి సిద్ధం అవుతున్నారన్న మాట. ఇకపోతే ఇందులో ఆయనకు జంటగా మలయాళ బ్యూటీ నజ్రియా నటించబోతున్నట్లు తెలిసింది. ఈమె చాలా కాలం తరువాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారన్నమాట. కాగా సుచిన్ శ్యామ్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే అధికారిక పూర్వకంగా వెలువడే అవకాశం ఉంది.