
డిసెంబర్‌లో వా వాద్ధియార్
తమిళసినిమా: ఇటీవల కార్తీ కథానాయకుడిగా నటించిన మెయ్యళగన్ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటూ, ప్రశంసలు అందుకుంది. కాగా ఈ చిత్రం తరువాత కార్తీ నటించిన మరో చిత్రం తెరపైకి రాలేదు. దీంతో ఆయన అభిమానులు తదుపరి చిత్రం గురించి ఎదురు చూస్తున్నారు. కాగా కార్తీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి సర్ధార్ –2 చిత్రం, ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరో చిత్రం వా వాద్దియార్. సూదుకవ్వుం, కాదలుమ్ కడందుపోగుం చిత్రాల ఫేమ్ నలన్‌కుమారసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలాకాలంగా నిర్మాణంలో ఉంది. ఇందులో కార్తీకు జంటగా నటి కృతిశెట్టి నటిస్తున్నారు. ఈ చిత్ర విజయం ఈ బ్యూటీకి చాలా అవసరం. కార్తీ హీరోగా నటిస్తున్న 26వ చిత్రం ఇది. దీన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ ప్రతినాయకుడిగానూ, రాజ్‌కిరణ్ తదితరులు ముఖ్య పాత్రల్లోనూ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు యూనిట్ బృందం ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా వా వాద్దియార్ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది కచ్చితంగా కార్తీ అభిమానులకు సంతోషాన్ని కలిగించే వార్తే అవుతుంది.