
కోలాహలం..వినాయకుడి నిమజ్జనం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహాలను భారీ పోలీసు బందోబస్తు నడుమ ఊరేగింపు నిర్వహించి కాకలూరు చెరువులో కోలాహలంగా నిమజ్జనం నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత బుధవారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు, ఊరేగింపులు నిర్వహించారు. అనంతరం మూడవ రోజైన శుక్రవారం రాత్రి పట్టణంలోని ఆయిల్ మిల్ నుంచి ప్రారంభమైన నిమజ్జన ర్యాలీ బజారువీధి, పడమటిరాజవీధి, సీవీనాయుడు రోడ్డు, జేఎన్‌రోడ్డు, ఆవడి రోడ్డు మీదుగా సాగి కాకలూరు చెరువులో నిమజ్జనం చేశారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్చిలు, మసీదుల వద్ద అదనపు బందోబస్తు నిర్వహించారు. కాగా వినాయకుడి విగ్రహాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆయిల్ మిల్ నుంచి ప్రారంభమైన వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం ప్రారంభమై శనివారం ఉదయం వరకు సాగింది.