
జర్మనీలో తమిళుల అభిమానం
సాక్షి, చైన్నె: జర్మనీలోని తమిళులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్‌కు ఘన స్వాగతం పలికారు. తమిళనాడుకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా యూరోపియన్ దేశాల పర్యటనకు శనివారం సీఎం స్టాలిన్ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. 8 రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి డస్సెల్డార్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సతీమణి దుర్గా స్టాలిన్, పరిశ్రమల మంత్రి టీఆర్‌బీ రాజతో కలిసి విమానాశ్రయం నుంచి వెలుపలకు వచ్చిన సీఎంకు నార్త్ రైన్–వెస్ట్‌ఫాలియా(ఎన్‌ఆర్‌డబ్ల్యూ) మంత్రి హెండ్రిక్ వుస్ట్ తరపున ప్రభుత్వ దౌత్య వ్యవహారాల ప్రతినిధి అన్యా డి వూస్ట్, రిసెప్షన్ భారత రాయబార కార్యాలయం బెర్లిన్ ఫ్రాంక్‌ఫర్ట్ ఇన్‌చార్జ్ అభిషేక్ దూబే, రాయబార కార్యాలయ ఛార్జ్ డి అఫైర్స్ అధికారి విభాకాంత్ శర్మ ఆహ్వానం పలికారు. విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు వెలుపల వందలాదిగా తమిళ ప్రజలు తమఅ భిమానంచాటుకున్నారు. పిల్లలు, పెద్దలు, అంటూ కుటుంబాలతో సహా ప్రవాస తమిళులు తరలి వచ్చి బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానం పలికారు. ప్లకార్డులను ప్రదర్శించి ఆహ్వానించారు. వారందర్నీ పలకరిస్తూ, పిల్లలను ఆప్యాయంగా ఎత్తుకుని సీఎం ముందడుగు వేశారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ, వందలాది మంది తమిళ ప్రజలు హాజరైన ఒక గొప్ప వేడుకగా పేర్కొన్నారు. తమిళ సంఘాలు నిర్వహించిన తమిళ సాంస్కృతిక కార్యక్రమాలను గుర్తు చేస్తూ, తమిళనాడు ప్రత్యేకతను చాటుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తన తమిళ కుటుంబాలు చూపి ఆప్యాయతకు దాసోహం అన్నట్టు ఎక్స్‌పేజీలో స్పందించారు. తమిళనాడు బలాన్ని ప్రదర్శించడానికి , పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉజ్వల భవిష్యత్తు కోసం ముందడుగు వేస్తున్నానని వివరించారు.
హలో జర్మనీ అంటూ..
హలో జర్మనీ! ఇక్కడ తమిళ కుటుంబం ఆప్యాయతకు ముందుకు అడుగు వేస్తున్నానని స్పందించారు. కాగా, సోమవారం డస్సెల్డార్ఫ్‌లో ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. పెట్టుబడిదారులు, వివిధ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో సీఎం ఈ సమావేశంలో మాట్లాడబోతున్నారు. భారతదేశంలో అత్యంత పారిశ్రామికీకరణ చెందిన రాష్ట్రం తమిళనాడు అని వివరించనున్నారు. అంతకుముందు ఆయన నార్త్ రైన్–వెస్ట్‌ఫాలియా మంత్రి హెండ్రిక్ వుస్ట్‌తో సమావేశం కానున్నారు. జర్మనీ పర్యటన తర్వాత, ముఖ్యమంత్రి ఇంగ్లాండ్ వెళ్లనున్నారు.

జర్మనీలో తమిళుల అభిమానం