
క్లుప్తంగా
అనుమానాస్పద స్థితిలో
యువతి మృతి
తిరువళ్లూరు: ప్రముఖ కంపెనీకి చెందిన గోడౌన్‌లో పని చేసే సమయంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ నల్లూరు గ్రామంలో ప్రముఖ సంస్థకు చెందిన గోడౌన్ వుంది. ఇందులో వస్తువులను నిల్వ వుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారికి సరఫరా చేస్తున్నారు. ఈ గోడౌన్‌లో పళవేర్కాడుకు చెందిన కీర్తిక(20) పనిచేస్తుంది. ఈక్రమంలో సోమవారం ఉదయం యథావిధిగా సంస్థకు చెందిన వాహనంలో ఇంటి నుంచి బయలుదేరి విధులకు హాజరైంది. అయితే సాయంత్రం కీర్తిక తల్లికి గోడౌన్ నిర్వాహకులు ఫోన్ చేసి కీర్తిక అనారోగ్యానికి గురి రావడంతో పొన్నేరి వైద్యశాలకు తరలించినట్టు చెప్పారు. కీర్తిక తల్లి పొన్నేరి వైద్యశాలకు వెళ్లగా ప్రాథమిక చికిత్స అనంతరం చైన్నెలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కీర్తిక మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మేట్టూరులో జలకళ
సేలం : ఈ సంవత్సరం మేట్టూర్ జలాశయం ఆరోసారి నిండింది. వివరాలు.. కావేరి నదిలో నీటి ఉధృతితో జలాశయంలోకి నీటి రాక పెరుగుతోంది. ఇక ఈ సంవత్సరం జూన్ 29న ఇది తొలిసారి నిండింది. జూలై 5న రెండవసారి, జూలై 20న మూడవసారి, జూలై 25న నాల్గవసారి, ఆగస్టు 20న ఐదవసారి ఈ జలాశయం పూర్తిగా నిండింది. ఆరో సారి మంగళవారం నిండు కుండగా మారింది. కర్ణాటకలోని జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో డ్యాంలోకి నీటి రాక పెరిగింది.ఉదయం 8 గంటలకు రిజర్వాయర్ నీటిమట్టం 120 అడుగులుకు చేరింది. జలవిద్యుత్ కేంద్రాల మార్గం ద్వారా జలాశయం నుంచి సెకనుకు 22,500 క్యూబిక్ అడుగుల చొప్పున నీటిని విడుదల చేశారు. ఓవర్‌ఫ్లో ఛానల్ ద్వారా సెకనుకు 12,500 క్యూబిక్ అడుగుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. అదనంగా, కాలువ నీటిపారుదల కోసం సెకనుకు 800 క్యూబిక్ అడుగుల నీటిని విడుదల చేశారు. జలాశయంలో నీటి నిల్వ 93.470 టీఎంసీలు. గత కొన్ని రోజులుగా నీటి ప్రవాహం తక్కువగా ఉండగా, ఇప్పుడు నీటి ప్రవాహం మళ్లీ పెరిగింది. ఇన్‌ఫ్లో ఆధారంగా బయటికి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
గణిత విద్యార్థుల కోసం
వినూత్న కిట్
కొరుక్కుపేట: ఐఐటీ మద్రాస్ విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డు గ్రహీత స్థాపించిన మద్రాస్ డిస్లెక్సియా అసోసియేషన్ (ఎండీఏ) గణితంలో అభ్యాస ఇబ్బందులు ఉన్న పిల్లల కోసం వినూత్నరీతిలో కిట్‌ను రూపొందించారు. పిల్లల కోసం ఒక పరిష్కార టూల్‌కిట్ అయిన కౌంట్ ఆన్ మీ అని పిలువబడే ఈ గణిత టూల్‌కిట్‌ను ఇప్పటికే చైన్నెలోని 50 పాఠశాలలు వినియోగిస్తున్నాయి. ఇది గణిత అభ్యాస ఇబ్బందులతో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఈ కిట్ రూపొందించినా, ఇది అందరు విద్యార్థులకు అభ్యాస వనరుగా నిరూపించబడిందని మద్రాస్ డిస్లెక్సియా అసోసియేషన్ అధ్యక్షుడు డి.చంద్రశేఖర్ ఈసందర్భంగా తెలిపారు.
వాహనం నుంచి పడి
యువకుడి దుర్మరణం
తిరువొత్తియూరు: పులియంపట్టిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా వాహనం నుంచి కింద పడి యువకుడు మృతిచెందాడు. ఈరోడ్ జిల్లా పుంజై పులియంపట్టిలో హిందూ మున్నని సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఊరేగింపు జరిగింది. ఊరేగింపుగా వెళ్లిన వినాయక విగ్రహాలను భవానీ సాగర్, పగుదురై, నదిలో నిమజ్జనం చేశారు. ఈ క్రమంలో పుంజై పులియంపట్టి కళాకార్ వీధికి చెందిన మెకానిక్ సుందరం కుమారుడు సంజయ్ (20) హిందూ మున్నని సంఘం తరఫున వినాయక చవితి ఊరేగింపులో పాల్గొని పగుదురైలోని నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసి టాటా ఏస్ వాహనంలో ఇంటికి తిరిగి బయలుదేరాడు. ముడుక్కన్ దురై, వారపు సంతకు సమీపంలో వచ్చినప్పుడు వాహనం వెనుక భాగంలో కూర్చున్న సంజయ్ వాహనం నుంచి కిందపడిపోయాడు. దీంతో సంజయ్‌కి తలకు తీవ్ర గాయం కావడంతో, వెంటనే అప్రమత్తమైన వారు, పోలీసులు ప్రాణాలతో పోరాడుతున్న సంజయ్‌ను ఆంబులెన్‌న్స్ ద్వారా సత్యమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే సంజయ్ మృతిచెందాడు. వాహనంపై కూర్చుని కిందపడిపోయిన సంజయ్ ఎలా మరణించాడు. అనే దానిపై భవానీసాగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా యువకుడు మృతిచెందిన ఘటన పులియంపట్టి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మేట్టూర్ ఆనకట్ట

క్లుప్తంగా

క్లుప్తంగా