
విద్యతోనే ఉత్తమ భవిష్యత్
కొరుక్కుపేట: విద్యతోనే మంచి భవిష్యత్ లభిస్తుందని ప్రముఖ నేత్రవైద్య నిపుణురాలు డాక్టర్ సరస్వతీ కర్ణాటి అన్నారు. ఎస్‌కేపీడీ అండ్ చారిటీస్ యాజమాన్యంలో కొనసాగుతున్న కేటీసీటీ బాలికల ప్రాథమిక, మహోన్నత పాఠశాలల 101వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ప్రముఖ నేత్రవైద్యనిపుణులు, కేటీసీటీ పూర్వ విద్యార్థిని డాక్టర్ సరస్వతి కర్ణాటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాలల వార్షిక నివేదికలను ప్రధానోపాధ్యాయులు కె. అనిల్ చుక్కా రేవతి సమర్పించారు ముందుగా కేటీసీటీ పాఠశాలల కరస్పాడెంట్ ఎస్.ఎల్ సుదర్శనం స్వాగతోపన్యాసం చేస్తూ వందేళ్ల పైగా చరిత్ర కలిగిన కేటీసీటీ పాఠశాలల బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రోత్సహిస్తుందని అన్నారు. ఎటువంటి డొనేషన్లు లేకుండా విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని ఈ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం ముఖ్యఅతిథి డాక్టర్ సరస్వతి చిన్ననాటి రోజులను గుర్తు చేస్తూ ప్రసంగించారు. విద్యార్థినులు కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్ల్లస్‌టూ పబ్లిక్ పరీక్షల్లో స్కూల్ టాపర్‌గా నిలిచిన కావలి సంధ్య, పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో స్కూల్ టాపర్ గానిలిచిన కావలి లహరికి రోలింగ్ షీల్డ్‌లు బహూకరించి అభినందించారు. అలాగే వివిధ పోటీల్లో విజేతలుగా ,నిలిచిన విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఎస్‌కేపీడీ ట్రస్టీ ఊటుకూరు శరత్‌కుమార్‌ను పాఠశాల తరఫున ఘనంగా సత్కరించారు. అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.