
నంబర్ ప్లేట్లు లేని 25 బైకులు స్వాధీనం
వేలూరు: నంబర్ ప్లేట్ లేని 25 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు వేలూరు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వివరాలు.. వేలూరు, కాట్పాడి వంటి ప్రాంతాల్లో తరచూ బైకులో చోరీలకు గురి అవుతున్నట్లు పోలీసులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మంగళవారం ఉదయం వేలూరు, కాట్పాడి ట్రాఫిక్ పోలీసులు పట్టణంలోని అన్ని సిగ్నిల్స్ వద్ద నిలిచి వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో బైకులకు ఎటువంటి ఆర్‌సీ పుస్తకాలు లేకుండా ఉండటం, డ్రైవర్‌కు లైసెన్స్‌లు లేకుండా ఉండటం, ఇన్సూరెన్స్, వాహనాలు నెంబర్ ప్లేట్లు లేకుండా ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ వేలూరు ఎస్పీ ఆదేశాల మేరకు వేలూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో నిఘా ఉంచడం జరిగిందని, ఆ సమయంలో నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న వాటిని స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ వాహనాలకు అపరాధ రుసుము విధించడంతో పాటూ వాహనాలకు నంబర్ ప్లేట్లు అమర్చిన అనంతరమే యజమానులకు అందజేస్తామన్నారు.