
డీజీపీ ఎంపికలో తర్జన భర్జన
సాక్షి, చైన్నె : రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ శంకర్ జివ్వాల్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో పూర్తిస్థాయిలో కొత్త డీజీపీ ఎంపికకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇన్‌చార్జ్ బాధ్యతలను డీజీపీ హోదాలో హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న సీనియర్ అధికారి జీ వెంకటరామన్‌కు అప్పగించారు. ఇన్‌చార్జ్ డీజీపీగా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర డీజీపీగా శంకర్ జివ్వాల్ ఏడాదిన్నర క్రితం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల విభాగం బాస్‌గా ఈ పదవి రాష్ట్రంలో కీలకం. ఈ పరిస్థితులలో ఆదివారం శంకర్ జివ్వాల్ పదవీ విరమణ చేశారు. ఆయన సేవలను ఉపయోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక కమిషనర్‌గా నియమిస్తూ ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది.అదే సమయంలో శంకర్ జివాల్ స్థానంలో కొత్త డీజీపీ ఎవరో అన్న చర్చ బయలు దేరింది. రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్‌లు సీనియర్ల జాబితాలో ఉన్నా, పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఎదురు చూపులు పెరిగాయి. సీమా అగర్వాల్, రాజీవ్ కుమార్, సందీప్ రాయ్ రాథోడ్‌లు సీనియర్ల జాబితాలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్లబోతున్నట్టు చర్చ ఊపందుకుంది. అలాగే వన్నియ పెరుమాల్, మహేశ్‌కుమార్ అగర్వాల్, జి వెంకటరామన్, వినీత్ దేవ్ వాంఖడే, సంజయ్ మాథూర్ కూడా రేసులో ఉండగా, వీరిలో ఎవరిని పదవి వరిస్తుందో అన్న ఎదురు చూపులు ఐపీఎస్ వర్గాలలో నెలకొన్నాయి.
ఇన్‌చార్జ్‌గా వెంకటరామన్..
పూర్తిస్థాయి శాంతి భద్రతల విభాగం డీజీపీ ఎంపికల మరింత జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఎం స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో కొత్త డీజీపీ ఎవరన్నది మరో వారం రోజులు వేచి ఉండాల్సిందే. ఈ పరిస్థితుల్లో పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు ఫోర్స్ డీజీపీగా ఉన్న వెంకటరామన్‌ను శాంతి భద్రతల విభాగం ఇన్‌చార్జ్ డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి దీరజ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మధ్యాహ్నం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఇన్‌చార్జ్ డీజీపీగా బాధ్యతలను వెంకటరామన్ స్వీకరించారు. ఆయనకు తన బాధ్యతలను శంకర్‌జివ్వాల్ అప్పగించారు. కాగా, తమిళనాడు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న సుశీల్‌కుమార్ యాదవ్ సైతం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఆ పోస్టుకు హె క్వార్టర్స్ డీజీపీ వినిత్ దేవ్ వాంఖడేను నియమించారు. శాంతి భద్రతల విభాగం డీజీపీ రేసు నుంచి వినిత్ దేవ్ తప్పుకున్నట్లయ్యింది. ఆయనకు డీజీపీ హోదాలో హౌసింగ్ బాధ్యతలను అప్పగించడం గమనార్హం.