
రోడ్డు ఆక్రమణపై పోలీసుల హెచ్చరిక
తిరుత్తణి: తిరుత్తణిలో నిత్యం రద్దీగా వుండే మార్కెట్ ప్రాంతంలోని ప్రధాన రోడ్డును ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంతో నిత్యం ట్రాఫిక్ చోటుచేసుకుని ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మపోసీ రోడ్డులో ఇటీవల రూ. కోటి వ్యయంతో కామరాజర్ మార్కెట్‌కు నూతన భవనం నిర్మించారు. పైగా హైవే శాఖ ద్వారా రోడ్డును విస్తరించి వాహనాల పార్కింగ్‌కు సైతం సైకర్యాలు కల్పించారు. దీంతో ప్రధాన రోడ్డు మార్గంలో వాహనాల ట్రాఫిక్ తగ్గుతుందని ఆశించారు. అయితే చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేస్తుండడంతో రోజూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ విషయంపై అనేక ఫిర్యాదులు అందాయి. ఈక్రమంలో ఆదివారం ఉదయం పోలీసులు రోడ్డును ఆక్రమించి వుంచిన దుకాణాదారులకు హెచ్చరికలు జారీ చేశారు. మార్కెట్ ప్రాంతంలో రోడ్డుపై దుకాణాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని అలాగే రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేస్తే జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.