
స్వేచ్ఛ కోసం పోరాడే వీర వణక్కమ్
తమిళసినిమా: మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అంటూ చక్కర్లు కొట్టేస్తున్న కథానాయికల్లో నటి మిర్ణా ఒకరు. ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం జైలర్–2 చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా తాజాగా మిర్ణా కథానాయకిగా నటించిన చిత్రం 18 మైళ్స్. నటుడు అశోక్ సెల్వన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సతీష్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్ల్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. కాగా ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటి మిర్ణా తెలుపుతూ నటనలో ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉన్న పాత్రలు లభిస్తేనే మంచి గుర్తింపు వస్తుందన్నారు. అలా బలమైన, కవితాత్మకమైన, అదే సమయంలో నిజమైన భావాలను ప్రదర్శించే కథా పాత్ర 18 మైళ్స్ చిత్రంలో తనకు లభించిందన్నారు. ఇందులో ఎక్కువగా మౌనం, హావభావాలతో చాలా సన్నివేశాల్లో నటించినట్లు చెప్పారు. సంభాషణలు అనేవి ఆ తరువాతనేనని అన్నారు. ఇలాంటి అద్భుతమైన కథా పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకుడు సతీష్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఇందులో కథానాయకుడిగా నటించిన నటుడు అశోక్ సెల్వన్ గురించి మాట్లాడుతూ తనకు ఇచ్చిన పాత్ర బాగా రావాలని భావించే నటుడాయన అని పేర్కొన్నారు. ఆయన డెడికేషన్ తనకు ఇన్సిపిరేషన్ అయ్యిందన్నారు. నటన మాత్రమే కాకుండా ప్రేమ, బాధ్యత వంటి విషయాలను వ్యక్తం చేసే ఇద్దరి వ్యక్తుల కఽథ 18 మైళ్స్ అని చెప్పారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ చిత్రం కథలోని భావాలను ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులు అర్ధం చేసుకుంటారని అభిప్రాయాన్ని నటి మిర్ణా వ్యక్తం చేశారు. కాగా ఎలాంటి పాత్రనైనా తనదైన నటనతో మెప్పించగల ప్రతిభ కలిగిన ఈమె ప్రస్తుతం మరిన్ని కొత్త చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారన్నది గమనార్హం.
తమిళసినిమా: కల్పిత కథలతో రూపొందే చిత్రాల మధ్య వాస్తవ సంఘటనల నేపథ్యంలో రూపొందే కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం వీర వణక్కం. 19వ శతాబ్దం ప్రారంభ దశలో స్వాతంత్రానికి ముందు, ఆ తరువాత జరిగిన యథార్థ సంఘటనలతో రూపొందిన చిత్రం ఇది. కుగ్రామాల్లో పేదలను బానిసలుగా చూస్తూ, వారిని స్వేచ్ఛకు దూరం చేసి గుత్తాధిపత్యాన్ని సాగించే మదాంధుల ఇతి వృత్తమే ఈ చిత్రం. నిరక్ష్యరాసులను తమ చెప్పు చేతల్లో ఉంచుకుని వారి మానశీలాలను దోచుకుంటూ ఎదురు చెప్పిన వారిని అంతం చేసే కామాంధుల కబంధహస్తాల నుంచి విముక్తి చేయడానికి పీ.కృష్ణపిళై అనే పట్టభద్రుడు, కమ్యూనిస్టు అహర్నిశలు శ్రమిస్తాడు. అట్టడుగు ప్రజల్లో వెలుగు కోసం ఊరూరా తిరిగి వారిని జాగృతి పరుస్తాడు. అందుకోసం ఆయన కామాంధులపై తిరుగుబాటు ప్రకటిస్తాడు. అయితే ఆయన కాలేకడుపులతో జీవశ్ఛవాలుగా బతుకులను ఊడ్చే బడుగు వర్గాల జీవన విధానంలో వెలుగులను నింపారా? ధనమధాంధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడా? అందుకు ఆయన ఎలాంటి త్యాగాలు చేశారు? అన్న ఇతి వృత్తంతో రూపొందిన చిత్రం వీర వణక్కం. మరో ఊరిలో మంచితనానికి మారుపేరుగా బాసిల్లే ఆదర్శవంతుడైన జమిందారీ వంశానికి చెందిన వ్యక్తి సమాజంలో సమానత్వం కోసం కృషి చేస్తాడు. ఆయన అన్యాయాలను, అక్రమాలను ఎదిరిస్తూ పేదలకు అండగా నిలుస్తాడు. కాగా కమ్యూనిస్ట్ పీ.కృష్ణపిళ్‌లైకి ఆయనకు గల సంబంధం ఏమిటీ? ఆయన చేసే సేవలు ఏమిటీ? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం వీర వణక్కమ్. పీ.కృష్ణపిళ్‌లైగా సముద్రఖని నటించగా జమిందారు వంశానికి చెందిన వ్యక్తిగా నటుడు భరత్ నటించారు. జాతీయ అవార్డు గ్రహీత సురభిలక్ష్మితోపాటు రితేశ్, సిద్ధిక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విశారత్ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. అనిల్ వీ.నాగేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.
మంచి
కథా పాత్రలు
లభిస్తేనే...

స్వేచ్ఛ కోసం పోరాడే వీర వణక్కమ్