మినీ బస్సు బోల్తా 12 మందికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

మినీ బస్సు బోల్తా 12 మందికి తీవ్రగాయాలు

Aug 30 2025 7:38 AM | Updated on Aug 30 2025 1:59 PM

Overturned bus

బోల్తా పడిన బస్సు

తిరుత్తణి: మినీ బస్సు బోల్తాపడిన ఘటనలో ప్రయివేటు కర్మాగారానికి చెందిన 12 మందికి గాయాలయ్యాయి. శ్రీపెరంబదూరులోని ప్రయివేటుకు చెందిన మద్యం కంపెనీలో తిరువలంగాడు యూనియన్‌లోని అడిక్కల్‌పట్టు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన మహిళలు పనిచేస్తున్నారు. కర్మాగారానికి చెందిన మినీబస్సులో రాకపోకలు సాగిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం యథావిధిగా అడిక్కల్‌పట్టు గ్రామానికి చెందిన 8 మంది మహిళలు సహా 12 మంది ప్రయాణిస్తున్నారు. అరుంగుళం వద్ద రోడ్డు పనుల కోసం వుంచిన చిప్స్‌ పక్కగా బస్సు వెళుతుండగా డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా బస్సు అదుపుతప్పి సమీపంలోని కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడి బస్సులో చిక్కుకున్న కార్మికులను స్థానిక గ్రామస్తులు బయటకు తీసి తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఇందులో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌ సంక్షోభ నివారణకు కొత్త ప్రణాళిక

కొరుక్కుపేట: వచ్చే ఏడాది వేసవిలో తమిళనాడులో పెరుగుతున్న విద్యుత్‌ సమస్య పరిష్కారానికి తమిళనాడు విద్యుత్‌ ఉత్పత్తి పరిరక్షణ సంస్థ ఏటా ఖర్చు చేసే రూ.2 వేల కోట్లకు బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతిలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తమిళనాడులో వార్షిక వేసవి విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడానికి, ప్రైవేట్‌ కంపెనీల నుంచి రూ.2 వేల కోట్లతో 6 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇది తమిళనాడు విద్యుత్‌ బోర్డు ఆర్థిక స్థితిని ప్రభావితం చేసింది. ఈ సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయి ఏప్రిల్‌ 2025లో 20,830 మెగావాట్లు. ఇది 2026 వేసవి నాటికి 23 వేల మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. వేసవిలో 7500 మెగావాట్ల లోటు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడానికి, విద్యుత్‌ బోర్డు విద్యుత్‌ ప్రసార వ్యవస్థ ద్వారా మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా, ఉత్తరాది రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుని, తమిళనాడులో పవన విద్యుత్‌ ఉత్పత్తి పెరిగినప్పుడు దాన్ని తిరిగి ఇస్తుందన్నారు. అందువల్ల, తమిళనాడు ప్రభుత్వం వేసవిలో సాధారణంగా జరిగే రూ. 2 వేల కోట్ల ప్రైవేట్‌ కంపెనీ సేకరణకు బదులుగా విద్యుత్‌ ప్రసార వ్యవస్థ ద్వారా 6 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా కొనసాగుతున్న విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోందని అధికారులు తెలిపారు.

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

కొరుక్కుపేట: శ్రీ కన్యాకా పరమేశ్వరీ మహిళా కళాశాల ఐ క్యూ ఏసీ, సృజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు వ్యవహారిక భాషా దినోత్సవం – గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాష ప్రాముఖ్యత అవగాహన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌ కేపీడీ మాజీ ట్రస్టీ ఊరా ఆంజనేయులు విచ్చేశారు. కళాశాల కరస్పాండెంట్‌ వూటకూరు శరత్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ పీబీ వనీత, వైస్‌ ప్రిన్సిపల్‌ ఎన్‌వీ నప్పినై , ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్‌ పి.భరణి కుమారి, తెలుగు విభాగాధిపతి మైథిలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథి ఊరా ఆంజనేయులు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి త్యాగస్ఫూర్తి, మహత్తర కృషి ఎనలేనిదన్నారు. తెలుగు భాషను గ్రాంధికం నుంచి సాధారణ ప్రజలకూ అర్థమయ్యే వ్యవహారిక భాషగా మార్చిన ఘనత గిడుగుకే దక్కిందన్నారు.

విద్యుత్‌షాక్‌తో విద్యార్థి మృతి.. గణేష్‌ చతుర్థి వేడుకలో అపశృతి

అన్నానగర్‌: గణేష్‌ చతుర్థి వేడుకలో విద్యుత్‌ షాక్‌కు గురై ప్లస్‌–2 విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని కట్టుకుడలూర్‌కు చెందిన ఇరుసప్పన్‌, లత దంపతులకు నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రామ జయం (17) ప్లస్‌–2 చదువుతున్నాడు. గురువారం సాయంత్రం గ్రామంలోని బాల మురుగన్‌ ఆలయంలో గణేశ చతుర్థి వేడుకలను జరుపుకున్నారు. వేడుకల్లో రామజయం లౌడ్‌ స్పీకర్‌లో మాట్లాడుతున్న సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై మరణించాడు. పోలీసులు కేసు నమేదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement