
టూరిస్ట్ ఫ్యామిలి చిత్ర దర్శకుడు హీరో అయ్యారు!
తమిళసినిమా: ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలి. శశికుమార్, సిమ్రాన్ జంటగా నటించిన ఆ చిత్రానికి అభిషన్ జీవింద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడంతోపాటు ఒక కీలక పాత్రను పోషించారు. కాగా తాజాగా అభిషన్ జీవింద్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌కు చెందిన జియోన్ ఫిలింస్, బిసిలియన్ నజ్రేద్, మహేశ్ రాజ్ బసిలియాన్‌కు చెందిన ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. మలయాళ నటి అనాశ్వర రాజన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమాల్లో నటుడు శశికుమార్, నటి సిమ్రాన్, నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ, మణికంథన్, దర్శకుడు రంజిత్ జయక్కొడి, లవర్ చిత్రం దర్శకుడు ప్రభురామ్‌వ్యాస్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి లవర్, టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన మదన్ కథ, కథనం అందించి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్యాన్‌లోల్డన్ సంగీతం, శ్రేయాస్ కృష్ణ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ఆధునిక యువతరాన్ని ఆకట్టుకునే యూత్‌పుల్ ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు ఆయన చెప్పారు.