
ఫైనాన్సియర్ సహా ముగ్గురి అరెస్టు
తిరుత్తణి: స్పీడ్ వడ్డీ చెల్లింపులో జాప్యం జరగడంతో చిన్నారిసహా దంపతులను లాడ్జీలో బంధించి దాడి చేసి, హత్య చేస్తామని బెదిరించిన అరక్కోణం పట్టనానికి చెందిన ఫైనాన్సియర్ సహా ముగ్గురిని తిరుత్తణి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుత్తణి పోలీసుల కథనం మేరకు.. తిరుత్తణి సాయిబాబానగర్‌కు చెందిన ప్రత్విరాజ్‌వర్మ(30) ఆటోడ్రైవర్. తన కుటుంబ అవసరాల కోసం అరక్కోణంలో ఫైనాన్స్ సంస్థలో స్పీడ్ వడ్డీకి భాస్కర్ అనే వ్యక్తి వద్ద రూ.50 వేలు అప్పు తీసుకున్నారు. ఇందుకోసం ముందుగా రూ.15 వేలు వడ్డీ పట్టుకుని రూ.35 వేలు ఇచ్చారు. ప్రతిరోజూ రూ.600 చెల్లించాలని, అప్పు 85 రోజుల్లో పూర్తిగా తిరిగి ఇవ్వాలన్నది వారి కండీషన్. 35 రోజులపాటు క్రమంగా రోజూ రూ.600 చెల్లిస్తూ వచ్చిన క్రమంలో పది రోజులుగా డబ్బులు చెల్లించకపోవడంతో ప్రత్వి రాజ్ వర్మ, అతని భార్య స్వాతి, వారి ఏడాదిన్నర బాలుడిని అరక్కోణం పట్టణానికి రమ్మని చెప్పడంతో వారు గురువారం ఉదయం అరక్కోణంలోని ప్రైవేటు లాడ్జీకి వెళ్లారు. అక్కడ ఒక గదిలో వారిని బంధించి హత్య చేస్తామని బెదిరించడంతోపాటు వడ్డీసహా డబ్బులు చెల్లించకపోతే విడిచిపెట్టబోమని చెప్పారు. దీంతో ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొస్తానని చెప్పి వచ్చిన ప్రత్విరాజ్ తిరుత్తణి ఏస్పీ కార్యాలయంలో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ దీవాన్ ఆదేశాల మేరకు తిరుత్తణి సీఐ మదియరసన్ అరక్కోణం పట్టణానికి వెళ్లి లాడ్డి గదిలో బంధించిన తల్లీబిడ్డను విడిపించుకుని అక్కడున్న ఇద్దరిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. అరక్కోణం మేల్పాక్కంకు చెందిన తమిళ్‌వానన్(34), దీపక్(35) ఇద్దరు భాస్కర్ అనే వ్యక్తి వద్ద పనిచేస్తున్నట్లు అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్న భాస్కర్ వద్ద డబ్బులు వసూలు చేసే పనిచేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఫైనాన్సియర్ భాస్కర్, తమిళ్‌వానన్, దీపక్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
అరెస్టయిన ఫైనాన్సియర్ భాస్కర్, తమిళ్‌వానన్

ఫైనాన్సియర్ సహా ముగ్గురి అరెస్టు