
పీఎంకేలో వారసురాలు శ్రీగాంఽధీకి పదవి
రాందాసు నిర్ణయం
సాక్షి, చైన్నె : పీఎంకేలో తన పెద్దకుమార్తె గాంధిమది అలియాస్ శ్రీ గాంధీకి రాందాసు పదవి కేటాయించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక దూసుకెళ్లనున్నారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి రాందాసు మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. తలా ఓ శిబిరంగా పార్టీని ముక్కలు చేసినట్టుగా నడిపించుకుంటున్నారు. ఎవ రికి వారు పోటా పోటీగా సర్వ సభ్య సమావేశాలను నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అన్బుమణికి చెక్ పెట్టే దిశగా రాందాసు వ్యూహాలకు పదును పెట్టినట్టున్నారు. తన పెద్దకుమార్తె గాంధి కుమారుడైన ముకుందన్‌కు యువజన పదవి అప్పగించే సమయంలో అన్బుమణి తీవ్ర వ్యతిరేకతను తెలియజేయడాన్ని పరిగణించి ఉన్నారు. అన్బుమణికి రాజకీయంగా చెక్ పెట్టేలా తన కుమార్తె గాంధీని రంగంలోకి దించేందుకు రాందాసు నిర్ణయించడం గమనార్హం. రాందాసు, అన్బుమణి మధ్య వార్ తీవ్రతరమైనప్పటి నుంచి రాందాసుకు పక్క బలంగా కుమార్తె గాంధీ, ఆమె కుమారుడు ముకుందన్ వెన్నంటి ఉంటూ వస్తున్నారు. పార్టీ సర్వ సభ్య సమావేశంలో సైతం అన్బుమణి కూర్చునే ప్రదేశంలో గాంధీ కూర్చున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు పార్టీ కార్యనిర్వాహక కమిటీలో చోటు కల్పిస్తూ రాందాసు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. కమిటీలోకి వచ్చిన అనంతరం ఆమెకు పార్టీలో కీలక పదవి అప్పగించనున్నట్టు సమాచారం. అన్బుమణికి ప్రత్యామ్నయంగా గాంధీని పీఎంకేలో ముందుకు తీసుకెళ్లే వ్యూహంతో రాందాసు ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. అన్బుమణిని పక్కన పెట్టి గాంధీ, ఆమె కుమారుడు ముకుందన్‌ను తెరపైకి తెచ్చి పార్టీని నడిపించే వ్యూహంలో భాగంగానే పీఎంకేలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.