అధికారం మనదే | - | Sakshi
Sakshi News home page

అధికారం మనదే

Aug 23 2025 2:45 AM | Updated on Aug 23 2025 2:45 AM

అధికా

అధికారం మనదే

అమిత్‌ షా ధీమా

అవినీతి డీఎంకేను గద్దె దించుదాం

ఆ ఇద్దరి కలలన్నీ కల్లే

తిరునల్వేలిలో బీజేపీ బూత్‌ కమిటీ మహానాడు

‘ఎన్‌డీఏ కూటమి రాజకీయ కూటమి కాదు అని, తమిళనాడు ప్రగతిని, తమిళ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే కూటమి. అవినీతిమయమైన డీఎంకే సర్కారును గద్దె దించేద్దాం. 2026లో తమిళనాడులో బీజేపీ– అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యం. అధికారం మనదే. ఇందుకోసం బీజేపీ బూత్‌ కమిటీలోని ప్రతి ఒక్కరూ వీరోచితంగా శ్రమించాల్సిన అవశ్యం ఉంది.’ అని కేంద్రహోం మంత్రి అన్నారు.

అమిత్‌ షా ప్రసంగం

సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాఽ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి డీఎంకేను గద్దె దించేద్దామని వ్యాఖ్యలు చేశారు. ఒకరేమో తన వారసుడ్ని దేశానికి ప్రధానిని చేయాలని, మరొకరేమో తనయుడ్ని తమిళనాడుకు సీఎం చేయాలని పరితపిస్తున్నారని, ఇది వారికి కలగానే మిగలబోతున్నట్టుగా సోనియా గాంధి, స్టాలిన్‌లను ఉద్దేశించి విమర్శలు ఎక్కుబెట్టారు.

తిరునల్వేలి తచ్చనల్లూరు వేదికగా శుక్రవారం బీజేపీ బూత్‌కమిటీ మహానాడు జరిగింది. తొలి విడతగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, విరుదునగర్‌ జిల్లాల నుంచి 25 వేల మంది బూత్‌ కమిటీ ప్రతినిధులను ఈ సమావేశానికి పిలిపించారు. మొత్తంగా లక్ష మంది కూర్చునేందుకు సీట్లు వేయగా, రెట్టింపుగా కమలనాథులు తరలిరావడంతో రాష్ట్ర బీజేపీ వర్గాల్లో జోష్‌ నిండింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల కోఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నేతలు అన్నామలై, రాజ, పొన్‌ రాధాకృష్ణన్‌, మహిళా నేతలు తమిళి సై సౌందరరాజన్‌, వానతీ శ్రీనివాసన్‌, సినీ నటుడు శరత్‌కుమార్‌ తదితరులు తరలివచ్చారు. ఈ వేదికలో అమిత్‌ షా సమక్షంలో డీఎంకేకు చెందిన నేత కేఎస్‌ రాధాకృష్ణన్‌ తన మద్దతు దారులతో బీజేపీ గూటికి చేరారు. ముందుగా ఇటీవల కన్నుమూసిన నాగాలాండ్‌ గవర్నర్‌ ఎల్‌ గణేషన్‌ చిత్ర పటానికి అమిత్‌ షాతో పాటుగా నేతలు పుష్పాంజలి ఘటించారు. మహానాడుకు హాజరైన వారందరూ మౌన నివాళులర్పించారు.

ఉగ్ర వెన్నెముకను విరిచేశాం

ఇటీవల జరిగిన పహల్గామ్‌ దాడిని గుర్తు చేస్తూ, అమాయక ప్రజలను హతమార్చిన ఉగ్రవాదులను కూకటి వేర్లతో సహా తుంచి పడేసే రీతిలో పాకిస్తాన్‌లోకి వెళ్లి మరీ వారి స్థావరాలను నామ రూపాలు లేకుండా చేశామన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్ర వెన్నెముకను విరిచేశామన్నారు. లోక్‌సభలో తాను రెండు రోజుల క్రితం ప్రవేశ పెట్టిన బిల్లుల గురించి ప్రస్తావిస్తూ, పీఎం, సీఎం, అంటూ ఏ పదవిలో ఉన్న వారైనా తప్పు చేసి జైలుకు వెళ్లే వారి పదవిని ఊడగొట్టేలా తీసుకొచ్చిన బిల్లుకు విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయన్నారు. తమిళనాడులో ఇది వరకు మంత్రులుగా ఉన్న పొన్ముడి, సెంథిల్‌ బాలాజీ వంటి వారు అనేక నెలలు జైలులో ఉన్నారని గుర్తు చేస్తూ, జైలులో ఉన్న వాళ్లు పాలకులుగా ఉండవచ్చా..? అని ప్రశ్నించారు. జైలు నుంచే పాలన సాగవచ్చా..? అంటూ ఈ బిల్లును స్టాలిన్‌ బాబు నలుపు బిల్లుగా అభివర్ణించారని వ్యాఖ్యానించారు. ఇది కాదు నలుపు చట్టం, చీకట్లో డీఎంకే చేసే రాజకీయం అంతా నలుపే.., వారి అవినీతి అంతా నలుపు మయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారి మనదే

డీఎంకే సర్కారు అవినీతి ఊబిలో కూరుకు పోయి ఉందంటూ ఈ సందర్భంగా జాబితాను ప్రకటించారు. అన్నింటా అవినీతి మయం అంటూ వీరిని గద్దె దించేందుకు సిద్ధమా..? సిద్ధమా..? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. గద్దె దించేద్దాం...! అంటూ 2026లో తమిళనాడులో బీజేపీ– అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇందు కోసం బీజేపీ బూత్‌ కమిటీలోని ప్రతి ఒక్కరూ వీరోచితంగా శ్రమించాల్సిన అవశ్యం ఉందని పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రగతిని , డీఎంకే అవినీతిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 18 శాతం, అన్నాడీఎంకేకు 21 శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో వేర్వేరుగా వెళ్లిన సమయంలోనే ఈ శాతం రాగా, ప్రస్తుతం ఇద్దరు ఒకే వేదికపైకి వచ్చిన దృష్ట్యా, 39 శాతం ఓట్లు ఖాతాలో ఉన్నట్టే అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ కూటమి రాజకీయ కూటమి కాదు అని, తమిళనాడు ప్రగతిని, తమిళ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే కూటమి అని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల ద్వారా తన కుమారుడు ఉదయనిధిని సీఎం చేయడానికి స్టాలిన్‌ తీవ్రంగా తహ తహలాడుతున్నారని, అలాగే, తన కుమారుడైన రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడానికి సోనియా గాంధీ తీవ్రంగా పరితపిస్తున్నారని అన్నారు. అయితే, ఈ ఇద్దరు కలలన్నీ కల్లే కాబోతున్నాయని, ఎన్‌డీఏ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేసి తీరుతామని, ఇందు కోసం శ్రమిస్తామంటూ కేడర్‌తో ఈ సందర్భంగా అమిత్‌ షా ప్రతిజ్ఞ చేయించారు. కాగా, ఈ సమావేశంలో మాట్లాడిన బీజేపీ నేత అన్నామలై రానున్న ఎన్నికల్లో అందరం సమష్టిగా పనిచేద్దామని, మరో ఎనిమిది నెలలు వీరోచితంగా శ్రమించి కూటమి పార్టీ అయిన అన్నాడీఎంకే నేత పళణిస్వామి నేతృత్వంలో అధికారం చేజిక్కించుకుంటామని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ సైతం తన ప్రసంగంలో అన్నాడీఎంకే పేరును, ఎంజీఆర్‌ గురించి పదే పదే గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నాడు కలాం.. నేడు సీపీఆర్‌

అమిత్‌ షా ఈ కార్యక్రమంలో ఇలగణేషన్‌ సేవలను గుర్తు చేస్తూ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాంను నాడు రాష్ట్రపతి సీటులో కూర్చోబెట్టింది ఎన్‌డీఏ అని వ్యాఖ్యానించారు. నేడు అదే తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి పదవిని అధిరోహింపచేసేందుకు ఎన్‌డీఏ సిద్ధమైందన్నారు. ఇందుకోసం తాను ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా, ఉపరాష్ట్రపతి తమిళ బిడ్డ సీపీ రాధాకృష్ణన్‌ కూర్చోబోతున్నారని, ఇందులో మార్పు అన్నది ఉండబోదని స్పష్టం చేశారు. తమిళనాడు, తమిళ ప్రజలు, తమిళభాషా, సంస్కృతి అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఎనలేని గౌరవం ఉందని, అందుకే ఎక్కడకెళ్లినా ఆయన తమిళ గ్రంథం తిరుక్కురల్‌లోని అంశాలను ప్రస్తావించడం జరుగుతోందని చెప్పారు. గంగై కొండ చోళపురంలో సహస్త్రాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడమే కాకుండా, స్వయంగా గంగా జలం తీసుకొచ్చి బృహదీశ్వరాలయంలో అభిషేకం చేయించారని గుర్తు చేశారు. సౌ రాష్ట్రా తమిళ సంగమం, కాశీ తమిళ సంగమం కార్యక్రమాలే కాదు, తిరుక్కురల్‌ను 134కు పైగా భాషల్లో తర్జుమా చేయిస్తున్న ఘటన ఒక్క ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతుందన్నారు.

అధికారం మనదే1
1/3

అధికారం మనదే

అధికారం మనదే2
2/3

అధికారం మనదే

అధికారం మనదే3
3/3

అధికారం మనదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement