
29 జిల్లాల్లో వర్షం అలర్ట్
సాక్షి, చైన్నె : చైన్నె, శివార్లలో పలు చోట్ల మోస్తారుగా శుక్రవారం వేకువ జామున వర్షం కురిసింది. తురైపాక్కం పరిసరాల్లో అత్యధికంగా పది సెంటీమీటర్ల వర్షం పడింది. 29 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతీ రుతు పవనాల రూపంలో తమిళనాడులో వర్షపాతం తక్కువే అన్నది తెలిసిందే. ఏటా నైరుతి రుతుపవనాల కన్నా, ఈశాన్య రుతు పవనాలతోనే మరీ ఎక్కువగా వర్షం పడుతుంది. నైరుతి రూపంలో కేరళ, కర్ణాటకలో కురిసే వర్షాలతో అక్కడి నుంచి తమిళనాడు వైపుగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లడం జరుగుతుంది. ప్రస్తుతం కావేరి నది ఉధృతంగా కర్ణాటక నుంచి ప్రవహిస్తున్నది. ఐదోసారి ఈ ఏడాది మేట్టూరు జలాశయం నిండింది. ఈ జలాశయం నుంచి ఉబరి నీటిని బయటకు పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం వేకువ జామున చైన్నె నగరంలో, శివార్లలో అనేక చోట్ల మోస్తారుగా వర్షం పడింది. ఉదయాన్నే రోడ్లపై వరదనీరు పారాయి. మైలాపూర్, తరమణి, షోళింగనల్లూరు, తురై పాక్కం పరిసరాల్లో భారీ వర్షం పడింది. తురైపాక్కంలో పది సెంటీమీటర్ల వర్షం పడింది. చైన్నెతో పాటు రాష్ట్రంలోని 29 జిల్లాల్లో రాగల 5 రోజులు మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, భారీగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తురైపాక్కం పరిధిలోని ఈంజంబాక్కం మునీశ్వర ఆలయం వీధిలో వర్షపు నీటిలో తెగి పడిన విద్యుత్ తీగను తొక్కడంతో ఆ ప్రాంతానికి చెందిన తాపీమేస్త్రి శామువేల్ మరణించాడు.