
ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
వేలూరు: సిమ్‌కో కో–ఆపరేటివ్ సొసైటీలోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్ణన్ అన్నారు. సిమ్‌కో కో–ఆపరేటివ్ సొసైటీ సాదారణ సమావేశం, లబ్ధిదారులకు సంక్షేమ సహాయకాల పంపిణీ కార్యక్రమం వేలూరులోని టౌన్ హాలులో జరిగింది. ఆయన మాట్లాడుతూ సిమ్‌కో సొసైటీ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలను ఎంపిక చేసి పలు సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. ముఖ్యంగా టైలరింగ్ పూర్తి చేసిన వారికి కుట్టుమిషన్లను అందజేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతం 20 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తున్నామని మిగిలిన వారికి కూడా విడతల వారిగా సీనియారిటి ప్రకారం అందజేస్తామన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులు ఉపయోగిస్తున్నారా వారికి ఏదైనా బ్యాంకు రుణాలు అవసరం ఉందా అనే కోణంలో అధికారులు తరచూ పర్యవేక్షించాలన్నారు. అనంతరం లబ్దిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. అసిస్టెంట్ మేనేజర్ కార్తికేయన్, తమిళనాడు సహాకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్, తిరువణ్ణామలై జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఇమయవర్మన్, నిప్‌కో చైర్మన్ కార్తికేయన్, పెరుమాల్‌కుప్పం సర్పంచ్ కోటీశ్వరన్, కార్పొరేటర్ లోకనాథన్, సిమ్‌కో అధ్యక్షురాలు అముద, బ్రాంచ్ మేనేజర్ నవీన్‌కుమార్, సిమ్‌కో కో–ఆపరేటివ్ సొసైటీ నిర్వహకులు, సభ్యులు పాల్గొన్నారు.