
ఆరోగ్య సంరక్షణ సేవలకు బీమా తప్పనిసరి
సాక్షి,చైన్నె : ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రస్తుతం బీమా తప్పనిసరిగా మారిందని, ప్రతి ఒక్కరూ బీమా సేవల గురించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ కమిటీ కో చైర్మన్ వెంకటాచలం తెలిపారు. ఆరోగ్యబీమాపై అవగాహన కార్యక్రమంలో శుక్రవారం స్థానికంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన సమగ్ర వివరాలను తెలియజేశారు. బీమా రంగంపై తమిళనాడులో వంద శాతం అవగాహన ఉందని, 70 శాతం మంది త్వరలో జీవిత బీమా కొనడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ కమిటీ చేపట్టిన అధ్యయనంలో వెలుగు చూసిన అంశాలు మరెన్నో ఉన్నాయన్నారు. పాలసీ దారులకు కాని వారిలో 70 శాతం మంది రానున్న 3 లేదా 6 నెలల్లో జీవిత బీమాలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్టు తేలిందన్నారు. 63 శాతం మందికి పొదుపు ఆధారిత జీవిత బీమా పాలసి కలిగి ఉన్నారని పేర్కొన్నారు. కుటుంబం కోసం 63 శాతం, పిల్లల భవిష్యత్తు కోసం 48 శాతం ఆర్థిక భద్రతను కలిగి ఉన్నట్టు తెలిపారు. రక్షణ, పొదుపు పథకాలతో పాటుగా అవగాహన పెంపునకు మరింతగా మార్గాలను సులభతరం చేయడం, విస్తృతం చేయడం అవశ్యంగా పేర్కొన్నారు.