
చైన్నెకు సుదర్శన్‌రెడ్డి రేపు రాక
సాక్షి, చైన్నె: ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి ఆదివారం చైన్నెకు రానున్నారు. సీఎం స్టాలిన్‌తోపాటు ఇక్కడున్న ఎంపీలను కలవనున్నారు. ఉప రాష్ట్రపతి ఎంపిక నిమిత్తం సెప్టెంబరు 9వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్‌డీఏ కూటమి తరఫున తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఇండియా కూటమి తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి పోటీకి దిగారు. ఈ ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఇప్పటికే దాఖలు చేశారు. తమిళనాడుతోపాటుగా పుదుచ్చేరిలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. డీఎంకే కూటమి గుప్పెట్లో ఈ స్థానాలన్నీ ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో తనకు మద్దతు తెలియజేయాలని కోరుతూ ఎంపీలను కలిసేందుకు సుదర్శన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన చైన్నెకు రానున్నట్టుగా సమాచారం వెలువడింది. తొలుత సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కలవనున్నారు. అనంతరం నగరంలో ఓ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో ఇతర పార్టీల నేతలు, ఎంపీలతో సుదర్శన్‌రెడ్డి సమావేశం కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పళణి గెలుపు కోసం తిరుమలకు పాదయాత్ర
సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళణి స్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటును కాంక్షిస్తూ చైన్నె నుంచి శుక్రవారం డాక్టర్ సునీల్ నేతృత్వంలోని బృందం తిరుమలకు పాదయాత్ర చేపట్టింది. అన్నాడీఎంకే యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో బృందం ఉదయం ఈ యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక పూజల అనంతరం యాత్రను చేపట్టారు. 2026లో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టాలని, 210 సీట్లలో గెలుపు ను కాంక్షిస్తూ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తూ యాత్రలో అడుగులు వేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళణిస్వామి 2026లో జరగనున్న తమిళనాడు శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో 210కి పైగా సీట్లు గెలుచుకుని తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతూ వరుసగా ఐదో సంవత్సరం చైన్నె నుంచి తిరుమలకు ఈ పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు.
నేడు రాష్ట్ర విద్యా విధానం ప్రాముఖ్యతపై సెమినార్
కొరుక్కుపేట: తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన రాష్ట్ర విధానాలను జాతీయ విద్యావిధానం ప్రతికూలతలను విద్యార్థుల దృష్టికి తీసుకురావాలనే లక్ష్యంతో ఆగస్టు 23వ తేదీ రాత్రి 10 గంటలకు చైన్నెలోని అన్నా సెంటెనరీ లైబ్రరీ హాల్‌లో ‘మన విద్య, మన హక్కు‘ అనే సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మార్గదర్శకత్వంలో డీఎంకే విద్యార్థి సంఘం కార్యదర్శి ఆర్.రాజీవ్ గాంధీ, రాష్ట్ర ఉప కార్యదర్శులు మన్నై టి.చోళరాజ్ నేతృత్వంలో ఈ సెమినార్ నిర్వహిస్తారు. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ , రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రత్యేక ప్రసంగం చేస్తారు. డీఎంకే జిల్లా, నగర, ఏరియా డీఎంకే విద్యార్థి విభాగం కార్యనిర్వాహకులు అందరూ తప్పకుండా ఈ సెమినార్‌కు హాజరు కావాలని అభ్యర్థించారు.
ప్రేమలత ఉద్వేగం!
సాక్షి, చైన్నె : డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, ఆమె కుమారుడు విజయ ప్రభాకరన్ తీవ్ర ఉద్వేగానికి లోనై వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఇందుకు కారణం విజయకాంత్ నటించిన కెప్టన్ ప్రభాకర్ చిత్రం రీ రిలీజ్ ప్రదర్శన వేదికగా మారింది. డీఎండీకే అధినేత, పురట్చి కలైంజ్ఞర్ విజయకాంత్ అందర్నీ వీడినా, ఆయన సేవలు, జ్ఞాపకాలు, నటించిన చిత్రాలు అజరామరం. ఆగస్టు 25వ తేదీ విజయకాంత్ జయంతి. 24వ తేదీ నుంచి వేడుకలు పేదరిక నిర్మూలన దినోత్సవంగా డీఎండీకే వర్గాలు జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో విజయకాంత్ నటించి సూపర్ హిట్ చిత్రం కెప్టన్ ప్రభాకర్‌ను రీ రిలీజ్ చేశారు. శుక్రవారం నైవేలిలోని ఓ థియేటర్‌లో ఆమె ఈ చిత్రాన్ని వీక్షించారు. విజయకాంత్ తెర మీద కనిపించగానే ఆమెతో పాటు కుమారుడు వెక్కి వెక్కి ఏడ్చేశారు. తీవ్ర ఉద్వేగంతో థియేటర్ నుంచి వారు బయటకు వచ్చారు.

చైన్నెకు సుదర్శన్‌రెడ్డి రేపు రాక

చైన్నెకు సుదర్శన్‌రెడ్డి రేపు రాక