విజయ్‌పై ముప్పెట్ట దాడి | - | Sakshi
Sakshi News home page

విజయ్‌పై ముప్పెట్ట దాడి

Aug 23 2025 2:45 AM | Updated on Aug 23 2025 2:45 AM

విజయ్‌పై ముప్పెట్ట దాడి

విజయ్‌పై ముప్పెట్ట దాడి

● బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకేల ఫైర్‌ ● మా ఇంటి బిడ్డగా ప్రేమలత అభివర్ణన

సాక్షి, చైన్నె : మహానాడు వేదికగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే కూటమి వర్గాలు తీవ్రంగా పరిగణించి శుక్రవారం ఎదురు దాడికి దిగాయి. మధురై మహానాడు వేదికగా విజయ్‌ బీజేపీ, డీఎంకేను తీవ్రంగా టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని అయితే, మిస్టర్‌ పీఎం అంటూ పలుసార్లు సంబోధించడమే కాకుండా ఆయన పూర్తి పేరును పేర్కొంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే డియర్‌, మైడియర్‌ అంకుల్‌ అంటూ సీఎం స్టాలిన్‌పై సైటెర్లు వేశారు. ప్రస్తుత రక్షకుల రూపంలో అన్నాడీఎంకేలోనే పరిస్థితులను గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు. పీఎంను టార్గెట్‌ చేయడాన్ని బీజేపీ వర్గాలు తీవ్రంగానే పరిగణించాయి. విజయ్‌పై ఎదురు దాడి చేస్తూ ఉదయం బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడారు. విజయ్‌ తనను ఎంజీఆర్‌తో సమానంగా పొల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంజీఆర్‌ ఇంటికి ఎవరు వెళ్లినా నిత్యం కడుపు నిండా అన్నం పెట్టే వారని వివరిస్తూ, అయితే, మహానాడుకు వచ్చిన వారిని ఆకలితో అలమటించేలా చేసిన ఘనత విజయ్‌ ఒక్కడికే దక్కిందని ధ్వజమెత్తారు. ఆహారం కోసం టోకెన్లను బ్లాక్‌లో అమ్ముకోవడం మరీ విడ్డూరంగా ఉందని పేర్కొంటూ, ఒక మహానాడును సరిగ్గా నిర్వహించలేని వ్యక్తి ఎలా ప్రజలకు సుపరిపాలన అందిస్తాడో అని మండిపడ్డారు. తమిళనాట ఎన్నికల్లో బీజేపీ, డీఎంకేకు మాత్రమే పోటీ అని వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ తన సిద్ధాంతాలు ఏమిటో విజయ్‌ ముందుగా స్పష్టత ఇవ్వాలన్నారు. పంచమూర్తుల సిద్ధాంతాలు అంటే చాలదని, అస్సలు ప్రజలకు ఏమి చేశావో, ఏమి చేయబోతున్నావో అన్నది తేటతెల్లం చేసి, ఆ తర్వాత ప్రత్యర్థి ఎవరన్నది ఎంపిక చేసుకో..? అని హితవు పలికారు. సిద్ధాంతాలే లేవు గానీ, సిద్ధాంత పరంగా బీజేపీ తన ప్రత్యర్థి అని విజయ్‌ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ సీనియర్‌ నేత, నటుడు శరత్‌కుమార్‌ మాట్లాడుతూ సిద్ధాంత పరంగా విజయ్‌ వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మిస్టర్‌ పీఎం అంటూ ప్రధాని నరేంద్ర మోదీని సంబోధించే స్థాయికి ఇంకా ఎదగలేదన్నారు. ముందుగా పాసిజం అంటే ఏమిటో తెలుసుకుని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇక, అన్నాడీఎంకే నేత జయకుమార్‌ మాట్లాడుతూ పళణి స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అధిష్టానాన్ని విమర్శించే అర్హత విజయ్‌కు లేదన్నారు. రాజకీయాల్లో అందరూ ఎంజీఆర్‌, జయలలితలు కాలేరని మండిపడ్డారు. ప్రజలకు తన విధి విధానాలు ఏమిటో ప్రకటించకుండా, ఏళ్ల తరబడి ప్రజల్లో ఉన్న తమను విమర్శించడం విజయ్‌ అవగాహన లోపానికి నిదర్శమని విమర్శించారు. రాజకీయాల్లో విజయ్‌ ఏడాదిన్నర బిడ్డ అని అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉపనేత ఆర్‌బీ ఉదయకుమార్‌ ఎద్దేవా చేశారు. విజయ్‌ షో అట్టర్‌ ప్లాప్‌ అంటూ, కేవలం ప్రజలకు షో చూపించే ప్రయత్నంలో నోటికి వచ్చింది వాగేసినట్టుగా అన్నాడీఎంకే సీనియర్‌ నేత సెమ్మైలె మండిపడ్డారు.

సవాళ్లకు ధీటుగా సమాధానం

విజయ్‌ విసిరే సవాళ్లు, ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు డీఎంకే సిద్ధం అని ఆ పార్టీ సీనియర్‌ నేత టీకేఎస్‌ ఇళంగోవన్‌ వ్యాఖ్యానించారు. కేవలం అధికారంలో ఉన్న వాళ్లనే విజయ్‌ టార్గెట్‌ చేయడం చూస్తే, వచ్చి రాగానే అధికారం కోసం ఆయన తహ తహలాడుతుండటం స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అంకుల్‌...అంకుల్‌ అంటు హేళనగా వ్యాఖ్యలు చేయడం నాగరిక రాజకీయమా..? అని ప్రశ్నించారు. తమ ప్రగతి ఏమిటో, తమ పథకాలు ఏ మేరకు ప్రజలకు చేరాయో అన్నది 2026 ఎన్నికల్లో తెలుస్తాయన్నారు. విజయ్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. సీఎంను అవమాన పరిచేలా, హేళన చేసే రీతిలో వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, లేకుంటే గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని విజయ్‌కు మంత్రి నెహ్రు హెచ్చరికలు చేశారు. ఇంకా ప్రజల్లోకే రాలేదు.. అలాంటప్పుడు డీఎంకే తనకు ప్రత్యర్థి అని విజయ్‌ ఎలా పేర్కొనగలడని, ఆయన వ్యాఖ్యలు సినీ డైలాగుల్ని తలపిస్తున్నాయంటూ సీపీఎం నేత షణ్ముగం, సీపీఐ నేత ముత్తరసన్‌లు ఎద్దేవా చేశారు. నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ స్పందిస్తూ మొదటి రోజు థియేటర్‌ ముందు జనం గుమి గూడినట్టుగా మహానాడుకు తరలి వచ్చారని, అయితే, సాయంత్రానికే జనం తిరుగు పయనం కావడం బట్టి చూస్తూ, ఈ మహానాడు హిట్టా...పట్టా అన్న విషయం విజయ్‌ గుర్తెరగాలని హితవు పలికారు. జనం తిరుగు పయనం కావడంతోనే ముందుగానే ఆగమేఘాలపై విజయ్‌ ప్రసంగాన్ని వీరావేశంతో అందుకున్నట్టుందన్నది స్పష్టమవుతోందన్నారు. ఇక, విజయ్‌ తమ ఇంటి బిడ్డ అని, అందుకే అన్నయ్య విజయకాంత్‌ను తలచుకున్నట్టుందని డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్‌ వెనకేసుకు రావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement