
కొలువుల జాతర
సాక్షి, చైన్నె : వైద్య, గ్రామీణ శాఖల్లో వివిధ పోస్టుల భర్తీ నిమిత్తం ఎంపిక చేసిన వారికి సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. మెడికల్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు ద్వారా తమిళనాడులోని ప్రభుత్వం ఆస్పత్రుల్లో సేవలు అందించేందుకు వివిధ పదవులకు మొత్తంగా 644 మందిని ఎంపిక చేశారు. ఇందులో 182 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, 48 మందిని దంత వైద్యులు, 324 మందిని ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు ఉన్నారు. అలాగే, వైద్య విద్య, పరిశోధన విభాగంలో 18 మందిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, మరో 17 మందిని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ కోసం క్లినికల్ సైకాలజిస్టులు, 54 మంది జిల్లా ఆరోగ్య అధికారులుగా నియమించారు. మొత్తం 644 మందికి సీఎం స్టాలిన్ నియామక ఉత్తర్వులను అందజేశారు. తాము అధికారంలోకి వచ్చినానంతరం 2021 నుంచి వైద్యశాఖలో జరిగిన నియామకాలను గుర్తించి ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, మేయర్ ప్రియ, ఎంపీ దయానిధి మారన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ తరపున రూ.104.24 కోట్లతో పూర్తి చేసిన భవనాలను సీఎం స్టాలిన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. వివిధ పోస్టులను భర్తీ చేస్తూ 818 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటిలో 66 కొత్త పాఠశాలల భవనాలు, నాలుగు లైబ్రరీలు, 49 స్టోర్ట్స్ భవనాలు, 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలు, 45 పంచాయతీ కార్యాలయాల భవనాలున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పెరియస్వామి, గాంధి, సీఎస్ మురుగానందం తదితరులు పాల్గొన్నారు.
ఆలయాలల్లో భక్తుల సేవకు
హిందూ మత ధార్మిక దేవాదాయ శాఖ నేతృత్వంలో ఆలయాల్లో భక్తుల సేవ నిమిత్తం రూ.124.97 కోట్లతో పూర్తి చేసిన 17 కొత్త ప్రాజెక్టులను సీఎం స్టాలిన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే రూ.32.53 కోట్లతో 9 పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. రూ.51.19 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 14 పనులకు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ మత ధార్మిక శాఖ మంత్రి శేఖర్‌బాబు, పర్యాటక, హిందూ ధార్మిక శాఖ కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్, కమిషనర్లు పీఎన్ శ్రీధర్ పళణి, జయరామన్, జానకి తదితరులు పాల్గొన్నారు. ముందుగా తమిళనాడు కన్స్యూమర్ గూడ్స్ కార్పొరేషన్ నేతృత్వంలో రూ.23.27 కోట్లతో నిర్మించిన ఐదు భవనాలు, రూ.30.38 కోట్లతో నిర్మించిన గిడ్డంగులు, రూ.7.20 కోట్లతో పూర్తి చేసిన మూడు ఆధునిక వరి నిల్వ సముదాయాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అలాగే టీఎన్‌పీఎస్సీ ద్వారా కన్స్యుమర్ గూడ్స్ కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న 63 పోస్టులకు ఎంపికై న వారికి సీఎం స్టాలిన్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చక్రపాణి, సీవీ గణేషన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, భూమి లేని వ్యవసాయ కార్మికులకు అందించే ప్రమాద బీమా పరిహారం పెంపునకు ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు రూ.లక్ష ఇస్తుండగా ఇక నుంచి రూ.2 లక్షలుగా నిర్ణయించారు. గాయాలకు రూ. 20 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. సహజ మరణాలకు ఆర్థిక సాయం ఇది వరకు రూ. 20 ఇవ్వగా, ఇక రూ. 30 వేలు అందజేయనున్నారు.

కొలువుల జాతర