
అన్నాడీఎంకేకు పునర్జీవం పోయ బోతున్నా!
– శశికళ
సాక్షి, చైన్నె: బలహీన పడ్డ అన్నాడీఎంకేకు పునర్జీవం పోయేబోతున్నానని, తనకు ఉన్న అనుభవంతో కార్యాచరణను విస్తృతం చేయనున్నట్టు దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యానించారు. పోయేస్ గార్డెన్‌లో మంగళవారం శశికళ మీడియాతో మాట్లాడారు. జయలలిత రాజకీయ ప్రయాణంలో తన పాత్రను గుర్తు చేశారు. ఆమెకు వెన్నంటి ఉంటూ అన్ని అంశాలను నిశితంగా పరిశీలించానన్నారు. 2011లో అధికారంలోకి వచ్చినానంతరం 2016లోమళ్లీ అధికారం దిశగా ముందడుగు వేసి విజయకేతనం ఎగుర వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరణం గురించి పేర్కొంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం కొందరి రూపంలో అన్నాడీఎంకే బలహీన పడిఉందని, అందర్నీ ఏకం చేయడం, బలహీన పడ్డ పార్టీకి పునర్జీవం పోయడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టనున్నట్టు, క్రియా శీలక రాజకీయాలోకి రానున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని, ఇందుకుగాను తనవంతుగా పార్టీకి పునర్జీవం పోయనున్నట్టు, ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు.
బస్సు ఢీకొని
వైద్యుడు దుర్మరణం
అన్నానగర్: విల్లుపురం రాష్ట్ర రవాణా సంస్థ బస్సు మంగళవారం ఉదయం చైన్నెలోని కల్పక్కం నుంచి చెంగల్పట్టుకు బయలుదేరింది. చెంగల్పట్టులోని రాట్టినక్కినారు రైల్వే ఫ్లైఓవర్ వద్ద వెళుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో రోడ్డు దాటేందుకు అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు వైద్యులను బస్సు ఢీకొని, చెంగల్పట్టు నుంచి మధురాంతకం వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో క్రోంపేట – హస్తినాపురం నుంచి డాక్టర్ మణికుమార్ (46), చైన్నెకి చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్, 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని రక్షించి చెంగల్పట్టు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డాక్టర్ మణికుమార్ మృతిచెందాడు. మణికుమార్ చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నారు. డాక్టర్ మణికుమార్ భార్య కూడా పిల్లల వైద్యురాలు. మణికుమార్ అవయవాలను దానం చేయడానికి 2 రోజు ల ముందు నమోదు చేసుకోవడం గమనార్హం. అయితే ప్రమాదంలో అతని అవయవాలు దెబ్బతినడంతో కళ్లను మాత్రం దానం చేశారు.
బహుళ అంతస్తులో అగ్నిప్రమాదం
సాక్షి, చైన్నె: చైన్నె అభిరామిపురం ఎంఆర్‌సీ నగర్‌లోని బహుళ అంతస్తుల భవనంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఎంఆర్‌సీ నగర్‌లో లగ్జరీ బహుళ అంతస్తుల భవనాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు బ్లాక్‌లతో కూడిన ఓ బహుళ అంతస్తుల భవనం వద్ద సాయంత్రం ఉత్కంఠ నెలకొంది. సీ బ్లాక్ ఐదవ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఐదవ అంతస్తు నుంచి ఆరో అంతస్తుకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లల ఉన్నవారందర్నీ బయటకు పంపించేశారు. మంటలను గంటన్నర సేపు శ్రమించి అదుపులోకి తెచ్చారు.
తంగచ్చి మఠంలో ఉద్రిక్తత
సాక్షి, చైన్నె : రామేశ్వరం తంగచ్చి మఠంలో మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామేశ్వరం – తాంబరం రైలు గంటన్నరకు పైగా మార్గమధ్యలో ఆగింది. తమకు భద్రత కల్పించాలని, శ్రీలంక చెరలో ఉన్న వారిని విడుదల చేయాలని, పడవలను స్వాధీ నం చేసుకోవాలని రామేశ్వరంలో జాలర్లు సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. మంగళవారం జాలర్లు, వారి కుటుంబాలు వందలాదిగా తంగచ్చి మఠం వద్ద రైల్వే ట్రాక్‌పై కూర్చున్నారు. అదే సమయంలో రామేశ్వరం నుంచి తాంబరం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రావడంతో డ్రైవర్ గమనించి రైలును ఆపేశాడు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో పోలీసులు చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు..