
సామరస్యం లేదు!
సాక్షి, చైన్నె: అన్బుమణితో సామరస్యానికి చోటు లేదని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఆదివారం సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న అధికార సమరం గురించి తెలిసిందే. పార్టీకి తానే అధ్యక్షుడ్ని అని మరో మారు అన్బుమణి ప్రకటించుకున్నారు. తన నేతృత్వంలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయించి 2026 ఆగస్టు వరకు తానే అధ్యక్షుడ్ని అని తీర్మానం కూడా చేయించారు. ఈ పరిణామాలు తండ్రి, తనయుడి మధ్య మరింత దూరం పె ంచేలా చేసింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం అన్బుమణి తైలాపురంలో ప్రత్యక్షం కావడంతో ప్రాధాన్యత నెలకొంది. తండ్రి, తనయుడి మధ్య వివాదం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. అయితే, అన్బుమణి తన తల్లి సరస్వతి అమ్మాల్ జన్మదిన వేడుక నిమిత్తం తైలాపురానికి వచ్చినట్టు తేలింది. తైలాపురంలో జరిగిన వేడుకలలో రాందాసు,అన్బుమణిలు ఒకే వేదిక మీద ఉన్న, కనీసం పలకరించుకోనట్టు సమాచారం. తల్లి కోసం వచ్చిన అన్బుమణి ఆతదుపరి అక్కడి నుంచి వెళ్లి పోయినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. ఈ పరిస్థితులో శనివారం రాందాసు మీడియాతో మాట్లాడుతూ అన్బుమణితో సామరస్యానికి చోటు లేదని స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన మేరకు తన నేతృత్వంలో ఆదివారం పార్టీ సర్వ సభ్య సమావేశం జరిగి తీరుతుందని, సభ్యులందరూ హాజరు అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.