
● జయలలిత రోల్ మోడల్ ● ప్రేమలత విజయకాంత్
ఆ ఇద్దరూ గురువులు
సేలం : ఎంజీఆర్, విజయకాంత్ తనకు రాజకీయ గురువులు కాగా, జయలలిత రోల్ మోడల్ అని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ వ్యాఖ్యానించారు. కెప్టెన్ రథయాత్ర పేరిట కేడర్‌లోకి చొచ్చుకెళ్లే రీతిలో ప్రేమలత విజయకాంత్ ప్రచార యాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో ఆమె సోదరుడు, డీఎండీకే కోశాధికారి సుదీష్ దివంగత సీఎం జయలలితను అనుకరించే తరహాలో ప్రేమలత ఫొటోను ఆయన విడుదల చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఈపరిస్థితుల్లో ప్రచారంలో భాగంగా సేలంలో పర్యటించిన ప్రేమలత మీడియాతో మాట్లాడారు. విజయకాంత్‌కు ఎంజీఆర్ అంటే ఎంతో ఇష్టం అని, ఆయన్ను అందరూ కరుప్పు ఎంజీఆర్‌గా అభివర్ణించే వారు అని గుర్తుచేశారు. తమ కార్యాలయంలో ఎంజీఆర్ విగ్రహం ఉన్నట్టు పేర్కొంటూ, తనకు ఎంజీఆర్, విజయకాంత్ రాజకీయంగా గురువులని వ్యాఖ్యానించారు. జయలలితను తాను గురువుగా పేర్కొన లేనని, ఆమె ముఖ్యమంత్రిగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించారని గుర్తు చేస్తూ, ఆమె తనకు రోల్ మోడల్ అని అన్నారు.
ప్రేమలత విజయకాంత్