
గంజాయి కేసులో యువకుడి అరెస్ట్
తిరువొత్తియూరు: గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబత్తూరు సమీపం అన్ననూర్ రైల్వే స్టేషన్ వద్ద ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ సీఐ రమేష్, ఎస్‌ఐ అమీర్ అలీఅంజా, పోలీసులు నిఘా పెట్టారు. ఆ సమయంలో త్రిపుర రాష్ట్రానికి చెందిన సమ్సుల్ హక్ అనే వ్యక్తి గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువైన 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను త్రిపుర నుంచి చైన్నెకి గంజాయిని తరలించి అంబత్తూరు, కొరటూరు, తిరుముల్లైవాయల్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలోని క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 75,740 మంది స్వామివారిని దర్శించుకోగా 34,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.84 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
టీటీడీకి కూరగాయల వితరణ
పలమనేరు : పట్టణానికి చెందిన శ్రీవారి సేవకులు కర్ణాటక రాష్ట్రం మాలూరు మార్కెట్ నుంచి పది టన్నుల వివిధ కూరగాయలను మంగళవారం టీటీడీ నిత్యాన్నదాన సత్రానికి పంపినట్టు కాప్పల్లి రవీంద్రారెడ్డి తెలిపారు. స్వామి వారి సేవకు కూరగాయలను అందించిన దాతలు యుగంధర్‌రెడ్డి, రంగయ్యగౌడ్, వెంకట్రామప్పను ఈ సందర్భంగా దాతలను వారు అభినందించి స్వామి వారి ప్రసాదాలను అందజేసినట్టు తెలిపారు. కూరగాయలను టీటీడీ ప్రత్యేక వాహనానికి పూజలు చేసి తిరుమలకు తరలించినట్లు చెప్పారు.
ఘనంగా సంకటహర చతుర్థి
కాణిపాకం : ప్రతినెలా జరిగే సంకటకహర చతుర్థి గణపతి వ్రతానికి భక్తులు పోటెత్తుతున్నారు. వత్ర నియమావళిని పాటిస్తూ..భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తున్నారు. స్వామిసేవలో తరిస్తూ.. కోర్కెలు నెరవేర్చాలని, కష్టాలు తొలగాలని...సత్య ప్రమాణాల దేవుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతంను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని నిర్వహించారు.