
ఏఐతో ఏనుగుల సంరక్షణ
● సీఎం స్టాలిన్
● తెప్పకాడులో ఏనుగుల దినోత్సవం
సాక్షి, చైన్నె: కొత్త సాంకేతికత ఏఐ ఆధారంగా కోయంబత్తూరు సమీపంలోని రైల్వే ట్రాక్ వెంబడి ఏనుగుల ప్రాణాలను సంరక్షించడంలో ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తున్నట్టు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. తమిళనాడు సహజ వారసత్వం, చరిత్రను ఏనుగుల విషయంలో కలిగి ఉన్నట్టు వివరించారు. సంపదను పెంచడంలో ఏనుగుల అపారమైన పాత్రను ప్రతిబింబించాయని గుర్తుచేశారు. కోయంబత్తూరు జిల్లాలోని రైల్వే ట్రాక్‌ల వెంబడి గతంలో నిత్యం ఏనుగుల మరణాలు చోటు చేసుకునేవి అని వివరించారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ఽ ఆధారంగా గత ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మార్గంలో ఏనుగులను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది కాలంలో రైలు ఢీ కొని ఎనుగులు మరణించక పోవడం కొత్త సాంకేతికత బలోపేతానికి దర్పణంగా వ్యాఖ్యానించారు. అలాగే, తెప్పకాడులో ఏనుగుల మావటీల కోసం ఒక గ్రామాన్ని కూడా నిర్మించామని వివరించారు. ఏనుగులను రక్షించడంలో, మావటిల సంక్షేమం ,శ్రేయస్సును మెరుగు పరిచే విధంగా ముందుకెళ్తున్నామన్నారు. భవిష్యత్తులో నూ ఏనుగులు సురక్షితంగా, స్వేచ్చగా జీవించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, నీలగిరి – కోయంబత్తూరు పరిధిలోని ముదుమలై తెప్పకాడులో ఏనుగుల శరణాలయం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ పదుల సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి. కేంద్ర అటవీ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పాటుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఇక్కడ జరిగిన ఏనుగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఏనుగులకు కావాల్సిన ఆహారాలను అందజేశారు. అలాగే కోయంబత్తూరు అవినాశి రోడ్డులోని ఓ హోటల్‌లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2025 లో భాగంగా ఇందులో మంత్రులతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు.
తెప్పకాడు శిబిరంలోని గజరాజులు