
ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్
అన్నానగర్: హత్య కేసును సరిగ్గా దర్యాప్తు చేయనందుకు సూలూరు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేయాలని డీఐజీ ఆదేశించారు. కోయంబత్తూరులోని చెట్టిపాళయం పోలీసు పరిధిలోకి వచ్చే మలు మిచ్చంపట్టిలో కొద్ది రోజుల క్రితం, తన స్నేహితుడిని చంపి బావిలో పడేసిన ఆరోపణలపై మలు మిచ్చంపాటికి చెందిన బాలమురుగన్, మురుగపెరుమాళ్ పోలీసులకు లొంగిపోయారు. సెట్డిపాళయం సూలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లెనిన్ అప్పదురై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇన్‌స్పెక్టర్ లెనిన్ అప్పదురై కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదు. అంతేకాకుండా హత్య కేసుపై ముందుగానే తెలిసినప్పటికీ, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ సమాచారం డీఐజీ శశిమోహన్‌కు తెలిసింది. దీని తర్వాత డీఐజీ శశిమోహన్ సోమవారం ఇన్‌స్పెక్టర్ లెనిన్ అప్పదురైని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
శ్రీవారి దర్శనానికి
8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 3 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 80,628 మంది స్వామివారిని దర్శించుకోగా 30,505 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
గంగమ్మ పసుపు, కుంకుమ ఊరేగింపు
నారాయణవనం: బుధవారం ఏడు గంగమ్మల జాతర నేపథ్యంలో గంగమ్మ ప్రతిమ తయారీకి వినియోగించే పసుపు, కుంకమలను నారాయణవనం వీధుల్లో ఊరేగించారు. బుధవారం నారాయణవనం, సముదాయం, వీకే పాళ్యం, ఎగువ, దిగువ బొప్పరాజుపాళ్యం, నాగిలేరు గ్రామాలలో ఏడు గంగమ్మలు కొలువుదీరుతాయి. ఇందులో భాగంగా నారాయణవనంలో బలిజ సంఘం ఆద్వర్యంలో నిర్వహించే గంగ జాతరలో అమ్మవారి ప్రతిమకు వినియోగించే పసుపు, కుంకమలను నారాయనవనం వీధుల్లో ఊరేగించారు. మహిళల కర్పూర హారతులు ఇచ్చారు. మంగళవారం ఉదయం పేరంటాల గరిక ఊరేగింపు ప్రారంభమవుతుందని జాతర ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం భారనారుషి ఆలయ సమీపంలోని రజక కాలనీ నుంచి అమ్మవారు సర్వ భూపాల వాహనంపై ఊరేగింపు ప్రారంభమై బుధవారం వేకువ జామున కోమటి బజారువీధిలో వీధి కూడలిలో కొలువుదీరుతారని చెప్పారు. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ నిర్వాహకులు శరత్‌కుమార్, బాబు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి అమ్మవారి నిమజ్జనం చేయనున్నట్లు వారు తెలిపారు. మట్లవారివీధి, కోమటి బజారువీధులను విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలతో సుందరంగా అలంకరించారు.