
తమిళసినిమా: పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న నటి పూజాహెగ్డే. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా హిందీ భాషల్లో నటిస్తున్నా ఈ అమ్మడికి క్రేజ్ తెచ్చిపెట్టింది తెలుగు చిత్ర పరిశ్రమనే. అక్కడ వరుస పెట్టి హిట్ చిత్రాల్లో నటించిన పూజాహెగ్డే ఆ తర్వాత వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొన్నారు. దీంతో టాలీవుడ్‌లో మార్కెట్ డౌన్ అయిపోయింది. అయితే ఈ బ్యూటీని కోలీవుడ్ రెండోసారి అక్కున చేర్చుకుంది. 13 ఏళ్ల క్రితం ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదట్లోనే అపజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో సంబరపడ్డారు. అయితే ఆ చిత్రం కూడా పూర్తిగా నిరాశనే మిగిల్చింది.
అయినప్పటికీ కోలీవుడ్ ఈమెను వదులుకోలేదు ఇటీవల సూర్యకు జంటగా రెట్రో చిత్రంలో నటించారు. ప్రస్తుతం మరోసారి విజయ్‌కు జంటగా జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి రాఘవ లారెన్స్‌తో కాంచన–4 చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. మధ్యలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన కూలీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. విశేషమేమిటంటే పూజాహెగ్డే ఇప్పటివరకు నటించిన ఏ చిత్రానికి రానటువంటి పాపులారిటీ ఈ ఒక్క పాటకే రావడం.
కూలీ చిత్రం గురువారం అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి రానుంది. పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రత్యేక పాటలో నటించడానికి అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. బాలీవుడ్‌లో తనను గ్లామర్‌డాల్‌గానే చూస్తున్నారన్నారు. బహుశా తెలుగు, తమిళ చిత్రాల్లో తను నటించడం వారు చూసి ఉండరేమో అని అన్నారు. తాను ఈ సమయంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రెట్రో చిత్రంలో తనను రుక్మిణీ కథాపాత్ర గానే మార్చారన్నారు. తనలోని నటనా ప్రతిభను ఆయన నమ్మారని పూజాహెగ్డే పేర్కొన్నారు.