
నటి షకీలా మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ యూట్యూబర్‌పై ఫిర్యాదు చేయడానికి మంగళవారం ఉదయం చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. పరువు హత్యలను సమర్థించేలా వ్యవహరిస్తున్న దివాకర్ అనే యూట్యూబర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. నటుడు జీపీ ముత్తుపైన కూడా అతడు అనుచిత వ్యాఖ్యలు చేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతి వివక్షకు పాల్పడుతున్న యూట్యూబర్ దివాకర్‌పై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు.
తమిళనాడులోని తిరునల్వేలిలో జూలై 27న జరిగిన పరువు హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తూత్తుకుడి జిల్లాకు చెందిన దళిత యువకుడిని దారుణంగా నరికి చంపడంతో కలకలం రేగింది. ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న కవిన్ కుమార్ (25)ని సుర్జీత్ అనే వ్యక్తి కొడవలితో నరికి హత్య చేశాడు. కవిన్ తన చెల్లిని ప్రేమించాడన్న అక్కసుతో సుర్జీత్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అక్కడి నుంచి పారిపోయి పాలయంకోట్టై పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుర్జీత్ తండ్రి శరవణన్, తల్లి కృష్ణకుమారి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు.
కాగా, కవిన్ కుమార్ హత్యపై తమిళనాడు (Tamil Nadu) వ్యాప్తంగా కలకలం రేగింది. పరువు హత్యను ప్రజా సంఘాలు, ప్రగతిశీలవాదులు ముక్త కంఠంతో ఖండించారు. నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ దివాకర్ ఒక భేటీలో పరువు హత్యను సమర్థించేలా వ్యాఖ్యనించారు. హత్యకు పాల్పడిన సుర్జీత్ తమ కులానికి చెందిన వాడని పేర్కొంటూ అతడిని వెనకేసుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా నటుడు జీపీ ముత్తు గురించి ప్రస్తావిస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై నటి షకీలా (Shakeela) లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.