
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
తిరువళ్లూరు: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థులే కీలక పాత్రను పోషించాలని రాష్ట్ర మంత్రి నాజర్ పిలుపునిచ్చారు. తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో చైన్నెలోని నందనం కళాశాల ఆవరణలో డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రతిజ్ఞ కార్యాక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరులోని శ్రీనికేతన్ పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కాగా విద్యార్థులు నో డ్రగ్స్ నమూనాలో నిలబడిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, కష్ణస్వామి, టీజే గోవిందరాజన్, దురైచంద్రశేఖర్, ఎస్పీ వివేకానందశుక్లా, సీఈఓ మోహన, డీఈఓ తేన్‌మెళి, శ్రీనికేతన్ పాఠశాల డైరెక్టర్ భరణీధరన్ పాల్గొన్నారు.
అవగాహన కార్యక్రమాన్ని తిలకిస్తున్న మంత్రి నాజర్