
వంక ఉధృతికి ఇద్దరు మహిళలు మృతి
వేలూరు: తిరువణ్ణామలై జిల్లా కలశపాక్కం సమీపంలోని 4,560అడుగు ఎత్తు ఉన్న పర్వతమలై కొండపై ప్రసిద్ధి చెందిన మల్లికార్జునర్, బ్రహ్మాంబిగై ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు పర్వతమలై కొండపైకి ప్రతి రోజూ ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి వెళ్తుంటారు. పౌర్ణమి రోజుల్లో భక్తులు వేల సంఖ్యలో కొండపైకి నడిచి వెళ్తుంటారు. దీంతో అటవీశాఖ అద్వర్యంలో పలు నిబంధనలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చైన్నె నుంచి వచ్చిన 15 మంది భక్తులు కొండపైకి ఉదయం వెళ్లి సాయంత్రం కిందకు దిగారు. ఆ సమయంలో వచ్చే దారిలో ఉన్న వంకను దాటేందుకు ప్రయత్నించారు. ఒకరినొకరు చేతులు పట్టుకొని వంకను దాటుతున్నారు. ఆ సమయంలో వర్షాలకు వచ్చిన నీరు ఒక్కసారిగా వంకలోకి రావడంతో చైన్నె వడపళనికి చెందిన తంగతమిల్(36) తిరువేర్‌కాడు ప్రాంతానికి చెందిన మనోహరన్ భార్య ఇందిర(58) వంకలోని నీటిలో కొట్టుకు పోయారు. దీంతో వారితోపాటు వచ్చిన భక్తులు కేకలు వేయడంతో అటవీశాఖ సిబ్బంది నీటిలొ కొట్టుకుపోయిన ఇద్దరు మహిళలను కాపాడేందుకు ప్రయత్నించారు. వీరితో పాటు స్థానిక మహిళలు కూడా నీటిలో గాలించారు. నీటిలో ఎక్కడ చూసినా ఇద్దరు మహిళలు కనిపించక పోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులతోపాటు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం కూడా గాలింపు పనులు చేపట్టడంతో సుమారు ఒక కిలో మీటరు దూరంలో ఇందిరను మృతదేహంగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా తంగతమిల్ సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలో కాలువలోని ముళ్ల పొదల్లో మృతదేహంగా కనిపించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం నుంచే కలెక్టర్ తర్పగరాజ్ నేరుగా పర్వత కొండ వద్దకు చేరుకొని వంకలో వెళ్తున్న నీటిని డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఇద్దరు మహిళా భక్తులు కొండ నుంచి వస్తున్న వంకలో కొట్టుకు వెళ్లడంతో ఆ ప్రాంతంలో సంచలనం రేపింది.