
యాదవులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ కులస్తులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి ఆదుకోవాలని కోరుతూ వేలూరు కలెక్టరేట్ ఎదుట గోకులం మక్కల్ పార్టీ అద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆ పార్టీ నిర్వహకులు ఎంపీ శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కులాలకు రిజర్వేషన్లున్నాయని అయితే యాదవ కులస్తులకు రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రిజర్వేషన్ కల్పించక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులు విద్య, ఉద్యోగాల్లో వెనుకంజలో ఉన్నారన్నారు. అదే విధంగా పశువుల సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గత కలైంజర్ ప్రభుత్వంలో అన్ని కులాలకు రిజర్వేషన్లు కేటాయించినప్పటికీ యాదవ కులాలను మాత్రం జాబితాలో ఉంచక పోవడం సరికాదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం వెంటనే యాదవులకు రిజర్వేషన్ కల్పించి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి శశికుమార్, జిల్లా అధ్యక్షుడు గోవిందస్వామి, కార్యదర్శి బాబు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.