విజయపథంలో.. సాగుదాం! | - | Sakshi
Sakshi News home page

విజయపథంలో.. సాగుదాం!

Aug 8 2025 7:55 AM | Updated on Aug 8 2025 2:20 PM

CM Stalin and others at peace rally

శాంతి ర్యాలీలో సీఎం స్టాలిన్‌ తదితరులు

డీఎంకే కేడర్‌కు సీఎం స్టాలిన్‌ పిలుపు 

‘కరుణ’కు ఘన నివాళి 

వాడవాడలా 7వ వర్ధంతి సభలు 

రాష్ట్రవ్యాప్తంగా శాంతి ర్యాలీలు 

సమాధి వద్దకు తరలిన నేతలు 

సాక్షి, చైన్నె : ద్రవిడ సిద్ధాంత కర్త పెరియార్‌కు శిష్యుడిగా, ద్రవిడ పార్టీ ఆవిర్భావ కర్త అన్నాదురైకు తమ్ముడిగా, తమిళ ప్రజలే తన శ్వాస అని చివరి వరకు రాజకీయ ప్రస్తానంలో అవిశ్రాంత నేతగా పనిచేసి అందరి హృదయాల్లో చిరస్మరణీయుడైన నేత కలైంజ్ఞర్‌ కరుణానిధి. 2018 ఆగస్టు ఏడో తేదీన ఇక సెలవంటూ అందర్నీ వీడారు. మెరీనా తీరంలో తన అన్న అన్నాదురై సమాధి పక్కనే శాశ్వత నిద్రలో ఉన్నారు. భౌతికంగా ఆయన లేకున్నా, తమిళ ప్రజల హృదయాల్లో మాత్రం చిరస్మరణీయుడే. ఆయన పేరిట డీఎంకే పాలకులు ప్రస్తుతం పథకాలను హోరెత్తిస్తూ వస్తున్నారు. 

కలైంజ్ఞర్‌ శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించడమే కాకుండా ఈ జయంతి స్మారకంగా అనేక భవనాలకు ఆయన పేరును నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో గురువారం కరుణానిధి మరణించి 7వ సంవత్సరం కావడంతో వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే నేతృత్వంలో జరిగాయి. వాడవాడలా కరుణ చిత్ర పటాల్ని డీఎంకే నేతలు ఉంచారు. పుష్పాంజలి ఘటించారు. అన్నదానం తదితర సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

శాంతి ర్యాలీతో..

రాష్ట్రవ్యాప్తంగా కరుణానిధిని స్మరించుకుంటూ నివాళులర్పించడమే కాదు, శాంతి ర్యాలీలలు జరిగాయి. మెరీనా తీరంలో శాశ్వత నిద్రలో ఉన్న కరుణానిధి సమాధి పరిసరాలను డీఎంకే వర్గాలు సుందరంగా తీర్చిదిద్దాయి. అలాగే పక్కనే ఉన్న అన్నా సమాధిని సైతం మరింత సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే డీఎంకే వర్గాలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించాయి. డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో ఉదయాన్నే ఓమందూరార్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఆవరణలోని కరుణానిధి నిలువెత్తు విగ్రహం వద్ద పార్టీ వర్గాలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. 

ఇక్కడి నుంచి పెద్దఎత్తున డీఎంకే వర్గాలు శాంతి ర్యాలీ నిర్వహించాయి. స్టాలిన్‌తో పాటూ మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు , ముఖ్య నాయకులు చేపాక్కం, ఎళిలగం, కామరాజర్‌ సాలై మీదుగా మెరీనా తీరంలోని కరుణానిధి సమాధి వరకు శాంతి ర్యాలీలో నడుచుకుంటూ వచ్చారు. తొలుత అన్నా సమాధి వద్ద నివాళులర్పించారు. తర్వాత కరుణానిధి సమాధి వద్ద స్టాలిన్‌ అంజలి ఘటించారు. 

డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, మంత్రులు దురై మురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, ఐ. పెరియస్వామి, కరుప్పనన్‌, ఏవీ వేలు, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, తదితరులు ఎంపీలు కనిమొళి, టీఆర్‌ బాలు, దయానిధి మారన్‌, రాజ, తదితరులు, పలువురు ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో కేడర్‌ శాంతి ర్యాలీతో తరలి వచ్చి కరుణ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం తేనాంపేటలోని పార్టీ కార్యాలయం అన్నా అరివాలయానికి చేరుకుని కరుణానిధి విగ్రహానికి సీఎంతో పాటుగా నేతలు పుష్పాంజలి ఘటించారు. ముందుగా గోపాలపురం, సీఐటీ నగర్‌ నివాసాలలో కరుణానిధి చిత్ర పటానికి స్టాలిన్‌ అంజలి ఘటించారు.

విజయం మార్గంలో పయనిద్దాం..

కరుణానిధి వర్ధంతిని పురస్కరించుకుని సీఎం స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. అన్నా సమాధి పక్కన శాశ్వత నిద్రలో ఉన్న అవిశ్రాంత నేతకు ఇదే నివాళులు అని పేర్కొన్నారు. గొప్ప తమిళ పండితుడు కలైంజ్ఞర్‌ వర్ధంతి గురించి ప్రస్తావిస్తూ, ముత్తువేల్‌, అంజుగం అమ్మయ్యర్‌ గొప్ప కళాకారుడ్ని ఈ ఈ భూమికి జన్మనిచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెరియార్‌, అన్న సేవలను గుర్తుచేస్తూ విజయాలకు ప్రసిద్ది చెందిన తమిళనాడును రక్షించుకోవాడానికి కలైంజ్ఞర్‌ దృష్టి,మార్గంలో, అందరికీ అన్నీ మెరుగు పరచాలన్న సంకల్పంతో వేగవంతంగా అడుగులు వేస్తున్నామన్నారు. 

అన్నింటా తమిళనాడు నంబర్‌–1 అన్న లక్ష్యం వైపుగా విజయ మార్గంలో పయనిద్దామని పిలుపు నిచ్చారు. కాగా, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌ తన సామాజిక మాధ్యమంలో పేర్కొంటూ 2026లో 200 స్థానాల కై వసం దిశగా పనిచేద్దాం..శ్రమిద్దాం ఇదే కరుణ వర్ధంతి ప్రతిజ్ఞ అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ సామాజిక న్యాయం నినాదంతో దూసుకెళ్దామని పిలుపు నిచ్చారు. ఇక మక్కల్‌ నీది మయ్యం నేత, ఎంపీ కమల్‌ స్పందిస్తూ, కరుణానిధి ఆధునిక తమిళనాడు నిర్మాత అని కొనియాడారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై స్పందిస్తూ తమిళ ప్రజలప్రగతి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నేత అని వ్యాఖ్యలు చేశారు. సినీ రచయిత వైర ముత్తు తన దైన శైలిలో కవితను ట్వీట్‌ చేశారు.

 Stalin Paid Tributes1
1/1

సమాధి వద్ద ఘన నివాళులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement