ఒకే విడతలో తమిళనాడు ఎన్నికలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పక్షాలు ఈసీని కోరాయి. ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందానికి గురువారం విజ్ఞప్తి చేశాయి. అలాగే, ప్రచారాలు, ఇతర కార్యక్రమాల అనుమతుల వ్యవహారంలో ఏక పక్ష ఉత్తర్వులు,ఆ దేశాలు తగదని, ఇందుకు కల్లెం వేయాలని కోరారు. వివరాలు.. కేంద్ర ఎన్నికలప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ నేతృత్వంలో ఏడుగురు కేంద్ర ఎన్నికల అధికారులు బుధవారం పుదుచ్చేరిలో పర్యటించిన విషయం తెలిసిందే. గురువారం చైన్నెలోని ఎంఆర్‌సీ నగర్ లీలాప్యాలెస్ హోటల్‌లో రాజకీయ పక్షాల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డీఎంకే తరపున ఆర్‌ఎస్ భారతీ, ఇలంగో, అన్నాడీఎంకే తరపున జయకుమార్, ఇన్బదురై, నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్‌లతో పాటూ ఆమ్‌ఆద్మీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ,కాంగ్రెస్, తదితర గుర్తింపుపొందిన పార్టీల తరపున ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలు, ఎన్నికల విజయవంతానికి రాజకీయ పక్షాల సహకారం గురించి జ్ఞానేశ్‌కుమార్ ఇందులో ప్రసంగించినట్టు సమాచారం.
డీఎంకే అనుకూల అధికారులకు నో..
చివరగా ఆయా పార్టీల తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉన్నాయి. ఇందులో అనుమతుల మంజూరు వ్యవహారంలో ఏక పక్షంగా వ్యవహరించ కూడదని, ఎన్నికలు ఒకే విడతగా నిర్వహించాలని కోరారు. అన్నాడీఎంకే తరపున అయితే, డీఎంకే విశ్వాసులైన అధికారులను మాత్రం రిటర్నింగ్ అధికారులుగా నియమించ వద్దని కోరారు. అలాగే, ఓటర్ల జాబితా విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డబుల్ ఓటరు జాబితా కు ఆస్కారం ఇవ్వకుండా సింగిల్ ఓటరు జాబితా అన్నది ఎన్నికల రోజున ఉపయోగించాలని పట్టుబట్టారు. కొత్తగా ఓటర్ల చేరికకు అవకాశం కల్పించి ఉన్న దృష్ట్యా, ఇందులో మరింత నిఘాతో వ్యవహరించాలని,చివరి క్షణంలో నమోదయ్యేపేర్ల వివరాలను ముందుగా బహిర్గతం చేయాలని కోరారు.అనంతరం 38 జిల్లా కలెక్టర్లు,ఎస్పీలుతో సమావేశం జరిగింది. జిల్లాల వారీగాఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను గురించి ఇందులో సమీక్షించారు. శుక్రవారం, ఈడీ, ఐటీ, డీజీపీ స్థాయి అధికారులు,సీఎస్,ఇతర సీనియర్ ఐఎఎస్‌లతో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ సమావేశం కానున్నారు. సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇదిలాఉండగా, ఎన్నికల నగారా మోగక ముందే ఈడీ, ఐటీ దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఐటీ నేతృత్వంలో గురువారం కంట్రోల్‌రూమ్ ఏర్పాటైంది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు ప్రకటించారు. ఇక ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్ చైన్నెకు చేరుకున్నారు. మూడు రోజుల పాటుగా ఇక్కడే ఆయన తిష్ట వేయనున్నడం గమనార్హం.


