చైన్నెలో బీజేపీ ఎన్నికల కార్యాలయం
సాక్షి, చైన్నె : చైన్నెలో బీజేపీ ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర సహాయ మంత్రి ఎల్‌మురుగన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రారంభించారు. వివవారుల.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ బీజేపీ చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ సాగుతున్నప్పటికీ, బీజేపీని నమ్ముకుని కూటమిలోకి వస్తున్న పార్టీలే అఽధికం. ఈ దృష్ట్యా, ఎన్నికల వ్యవహారాలన్నీ ఈ కార్యాలయం నుంచి సాగించే విధంగా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం ఓ కల్యాణ మండపాన్ని అద్దెకు తీసుకున్నారు. పూర్తిగా దీనిని ఎన్నికల కార్యాలయంగా మార్చేసి, ప్రత్యేక గదులు, సమావేశ మందిరం, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం అంటూ అన్ని హంగులను పొందు పరిచారు. 24 గంటల పాటూ ఈ కార్యాలయం తెరచి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, పార్టీ సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ పీయూష్ గోయల్ 28వ తేదిన చైన్నెకు రానున్నారు. ఇక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు, వ్యూహాలకు పదును పెట్టనున్నారు.


