పొన్నేరి మున్సిపల్ అధికారులపై చర్యలు
తిరువళ్లూరు: ఆరణి నది పరివాహక ప్రాంతాల్లో పర్యావరణానికి ముప్పు కలిగించేలా చెత్తకుప్పలను డంప్ చేస్తున్న పొన్నేరి మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతాప్ అన్నారు. తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులోని సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ తిరువళ్లూరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతాప్ ముఖ్యఅతిథిగా హాజరై, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తకుప్పలను తొలగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతివారం ప్రభుత్వ కార్యాలయాలు, నదీ పరివాహాక ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వస్తువులను తొలగించేందుకు స్వచ్ఛతిరువళ్లూరు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా సహకారం అందించాలని పిలుపు నిచ్చారు. నీటి ఆధారిత ప్రాంతాలు, నదులు, సముద్రతీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, యువత, విద్యార్థులు రోజుకు గంటైనా ప్లాస్టిక్ వస్తువులను తొలగించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆరణి నది పరివాహక ప్రాంతాల్లో పొన్నేరి మున్సిపల్ అధికారులు చెత్తకుప్పలను డంప్ చేయడంతో పర్యావరణానికి పెనుసవాలుగా మారిందన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ నదులు, సముద్రతీర ప్రాంతాలు, నీటి ఆధారిత ప్రాంతాల్లో చెత్తకుప్పలను డంప్ చేయడాన్ని నిషేధించినట్టు తెలిపారు. ఆరణి నదీ పరివాహక ప్రాంతాల్లో చెత్తకుప్పలను డంప్ చేస్తున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నేరి సబ్‌కలెక్టర్ రవికుమార్, గుమ్మిడిపూండి పర్యావరణశాఖ అధికారి లివింగ్‌స్టన్, పొన్నేరి తహసీల్దార్ సోమసుందరం పాల్గొన్నారు.


