వేలుమణికి హత్యా బెదిరింపులు
● కోవై కమిషనర్‌కు ఫిర్యాదు
సాక్షి, చైన్నె: మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి హత్యా బెదిరింపులు రావడంతో భద్రత కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆయనకు బెదిరింపు ఇచ్చిన వారిని గుర్తించాలని, భద్రత కల్పించాలని కోయంబత్తూరు కమిషనరేట్‌లో ఎస్పీ వేలుమణి మద్దతుదారులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, తొండముత్తురు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్పీ వేలుమణి కోయంబత్తూరు కునియాముత్తూరులో నివాసం ఉన్నారు. ఆయన ఇంటికి వచ్చిన పోస్టల్ బెదిరింపు లేఖ కలకలం రేపింది. ఎస్పీ వేలుమణిని హతమార్చనున్నామన్న హెచ్చరికలు ఉన్నాయి. ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల మధ్య కలియపెరుమాల్ కొలను సమీపంలోని చెత్త డంప్‌యార్డ్ వద్ద రూ.కోటి నగదు ఉంచి వెళ్లాలని, లేకుంటే మూడు నెలల్లో ఎస్పీ వేలుమణి, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామని ఆ లేఖలో ఉండడంతో మద్దతుదారులు వెంటనే స్పందించారు. వేలుమణి తరఫున ఆయన మద్దతుదారు దామోదరన్ నేతృత్వంలోని బృందం కోయంబత్తూరు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ వేలుమణికి, ఆయన కుటుంబసభ్యులకు భద్రత కల్పించాలని కోరారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం కొంగు మండలంలో అత్యంత కీలక నేతగా వేలుమణి ఉన్నారు. పార్టీ పరంగా ఆయన కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈసమయంలో బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయో అనే దిశగా అన్నాడీఎంకే వర్గాలు సైతం ఆరా తీస్తున్నాయి.


