కేపీవై బాలా హీరోగా నూతన చిత్రం
నటుడు కేపీవై బాలా హీరోగా నటిస్తున్న చిత్ర ప్రారంభోత్సవంలో యూనిట్ సభ్యులు
తమిళసినిమా: టీవీ కార్యక్రమాల ద్వారా ప్రాచూర్యం పొందిన నటుడు కేపీవై. బాలా ఇప్పుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాన్ని ఆదిమూలం క్రియేషన్స్ పతాకంపై జయ్‌కిరణ్ నిర్మిస్తున్నారు. దీనికి కథ, దర్శకత్వం బాధ్యతలను షెరీఫ్ నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు రణం అరం తవరేల్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ చిత్రం గురువారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది తనకు ఇష్టమైన కథ అన్నారు. ఒక యదార్థ సంఘటనతో కూడిన ఈ కథను నిర్మాతకు చెప్పగా వెంటనే చేద్దాం అని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత బాలాజీ శక్తివేల్, ఉత్తమ నటి అవార్డు గ్రహీత అర్చన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. ఇందులో కేపీవై బాలాకు జంటగా నటి నమిత నాయకిగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి వివేక్–మెర్విన్‌ల ద్వయం సంగీతాన్ని బాలాజీ కె.రాజా ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ఇది ఫీల్‌గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ డ్రామాగా ఉంటుందని చెప్పారు. చిత్ర కథ, కథనం చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు చెప్పారు.


