నేడు ప్లస్–2 ఫలితాలు
సాక్షి, చైన్నె: ప్లస్–2 ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంది. ఇక, ఇంజినీరింగ్ కోర్సుల దరఖాస్తుల ప్రక్రియకు బుధవారం శ్రీకారం చుట్టారు. తమిళనాడు వ్యాప్తంగా మార్చి 3 నుంచి 25వ తేదీ వరకు ఫ్లస్ –2 పబ్లిక్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 8 లక్షల 21 వేలమంది విద్యార్థులు పరీక్ష రాశారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 9వ తేదీన ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే, ఒక రోజు ముందుగానే 8వ తేదీ ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంది. గురువారం ఉదయం 9 గంటలకు ఫలితాలను విద్యా శాఖ మంత్రి అన్బిల్‌మహేశ్ విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు వెబ్‌సైట్లను ప్రకటించారు. అలాగే వారి రిజిస్ట్రడ్ మొబైల్ నెంబర్లకు సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఇంజినీరింగ్ దరఖాస్తులు..
గురువారం ప్లస్–2 ఫలితాల విడుదల నేపథ్యంలో బుధవారం ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ నిమిత్తం దరఖాస్తుల ప్రక్రియకు ఉన్నత విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. గిండిలోని సాంకేతిక విద్యా డైరెక్టరేట్‌లో దరఖాస్తుల ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాకార్యదర్శి సమయమూర్తి కమిషనర్ సుందర వళ్లి, సాంకేతిక విద్యా డైరెక్టర్ ఇన్సంట్ దివ్య పాల్గొన్నారు. జూన్ 6వ తేది వరకు విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పించారు.సర్టిఫికెట్లను జూన్ 9 లోపు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 10 నుంఇచ 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు చర్యలు తీసుకున్నారు.జూన్ 11న ర్యాండం నెంబర్లు ప్రకటించనున్నారు. జూన్ 27న ర్యాంక్ జాబితా ప్రకటించనున్నారు.జూన్ 28 నుంచి జూలై 2వ తేది వరకు దరఖాస్తులలో ఏదేని సవరణలు, అనుమానాలు ఉంటే నివృతి చేసుకునే అవకాశం విద్యార్థులకు ఇచ్చారు. విద్యామంత్రి కోవి చెలియన్ మాట్లాడుతూ, కౌన్సిలింగ్ తేదీ ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలోని 11 కళాశాలలో కొత్త కోర్సులను పరిచయం చేయనున్నామని, ఇందులో ఏఐ కోర్సులు కూడా ఉన్నట్టు వివరించారు. ఈ కోర్సులతో 720 మంది విద్యార్థులకు అదనంగా సీట్లు దక్కనున్నాయన్నారు. 13 పాలిటెక్నిక్ కళాశాలలో ఐదు కోర్సులనుప్రవేశపెట్టనున్నామన్నారు. 110 చోట్ల సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యార్థులు ఈ కేంద్రాలను సంప్రదించి తమ అనుమానాలను నివృతి చేసుకోవచ్చు అని సూచించారు. అలాగే 180042 50110 నంబరును సంప్రదించ వచ్చు అని సూచించారు.
సర్వం సిద్ధం
ఇంజినీరింగ్ దరఖాస్తులకు శ్రీకారం


