
సాక్షి, చైన్నె: మాజీ గవర్నర్, బీజేపీ మహిళా నేత తమిళి సై సౌందరరాజన్ వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాలను విస్మయంలో పడేసింది. అధికారంలో వాటా అన్న నినాదాన్ని అందుకుంటూ, అప్పుడే అందరూ ఆకులో పరిపుష్టిగా భుజించగలరని వ్యాఖ్యానించడం చర్చకుదారి తీసింది. బీజేపీ– అన్నాడీఎంకే కూటమిమళ్లీ వికసించిన విషయం తెలిసిందే. అధికారంలో వాటా అన్న నినాదం బయలు దేరినా అందుకు ఛాన్స్‌లేదంటూ అన్నాడీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అన్నాడీఎంకే సంపూర్ణ మెజరిటీతో అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ వర్గాలు విస్తృత కార్యాచరణతో పనుల వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే.
కనీసం 160 స్థానాలలో తమ అభ్యర్థులను నిలబెట్టే వ్యూహంతో అన్నాడీఎంకే ముందుకెళ్తోంది. అదే సమయంలో బీజేపీ నేతలెవ్వరూ కూటమి విషయంగా, పొత్తు, సీట్ల పందేరం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అన్న అన్నాడీఎంకే విజ్ఞప్తికి ఆ పార్టీ నాయకులు అంగీకరించారు. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తమ పార్టీ వర్గాలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అన్నాడీఎంకే కూటమిపై, ఆ పార్టీ విషయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని హుకుం జారీ చేశారు. అయితే, తాజాగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ మహిళ నేత తమిళి సై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
ప్రకాశం..వికాసం
తమిళి సై మాట్లాడుతూ, కొలనులో కమలం ప్రకాశంతంగా వికసించి ఉందని వ్యాఖ్యలు చేశారు. అదే అధికారంలోకి అయితే, రెండాకులతో పాటూ కమలం కూడా వికసిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి రావాలంటూ కూటమి ప్రభుత్వం, అధికారంలో వాటా విషయంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే, అందరూ కూర్చుని ఆకు వేసుకుని పరిపుష్టిగా ఆహారాన్ని భుజగించగలమని వివరించారు. పార్టీ, కూటమి విషయంగా నేతలెవ్వరూ స్పందించ వద్దని అధిష్టానం ఆదేశించినా, తమిళిసైమాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తుండడాన్ని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణించే అవకాశం కనిపిస్తోందనే ప్రచారం సాగుతోంది.