రూ. 359 కోట్ల సంక్షేమ పథకాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

రూ. 359 కోట్ల సంక్షేమ పథకాల పంపిణీ

Mar 13 2026 8:00 AM | Updated on Mar 13 2026 8:00 AM

– పెరంబలూరులో ఆనై ముత్తు శత జయంతి

సాక్షి, చైన్నె: పెరంబలూర్‌, అరియలూర్‌ జిల్లాల్లో రూ. 359 కోట్ల సంక్షేమ పథకాలను గురువారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ అందజేశారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధిలో మహిళలు, విద్యార్థులు, సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఉదయనిధి వ్యాఖ్యానించారు. పెరంబలూర్‌ జిల్లాలో నిర్వహించిన సామాజిక న్యాయ పోరాట యోధుడు వి. ఆనైముత్తు శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, పెరంబలూర్‌, అరియలూర్‌ జిల్లాలకు చెందిన సుమారు 10,000 మంది లబ్ధిదారులకు రూ. 359 కోట్ల విలువైన ప్రభుత్వ సంక్షేమ సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వ విజయాలను వివరించారు.

మహిళా సంక్షేమం – విప్లవాత్మక మార్పులను ప్రస్తావిస్తూ, ఇతర రాష్ట్రాలు సైతం ద్రావిడ మోడల్‌ను అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. ద్రావిడ మోడల్‌ 2.0 ప్రభుత్వంలో పథకాలు మరింత విస్తృతం కానున్నాయని తెలిపారు. ఈ ఏడాది 10 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

జిల్లాల్లో అభివృద్ధి పనులు

పెరంబలూర్‌, అరియలూర్‌ జిల్లాల్లో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులను ఆయన వివరించారు: వేప్పంతట్టైలో రూ. 400 కోట్లతో ఫీనిక్స్‌ షూ ఫ్యాక్టరీలో 4,000 మందికి ఉపాధి, పాడలూరులో రూ. 150 కోట్లతో పాలపొడి కర్మాగారం 1,500 మందికి ఉపాధి కల్పన చర్యలను పేర్కొన్నారు. పెరంబలూర్‌–తురైయూర్‌ మధ్యరూ.210 కోట్లతో రహదారి నిర్మాణం, రూ. 175 కోట్లతో అరియలూర్‌–జయకొండం నాలుగు రోడ్ల రహదారి గురించి తెలియజేశారు. అరియలూర్‌లో రూ. 10 కోట్లతో అధునాతన హాకీ మైదానం, కొత్త బస్టాండ్‌ నిర్మాణం జరిగిందన్నారు.

ఆనైముత్తు శతజయంతి

బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడిన ఆనైముత్తు సేవలను స్మరిస్తూ, ఆయన శతజయంతిని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామన్నారు. ఆయన రాసిన పుస్తకాలను ప్రభుత్వం జాతీయం చేసిందని ఉదయనిధి తెలిపారు. తాను కేవలం కలైంజ్ఞర్‌ మనుమడిగానే కాకుండా, పెరియార్‌, ఆనైముత్తు గారి ఆశయాల వారసుడిగా ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎస్‌.ఎస్‌. శివశంకర్‌, ఎంపీలు ఎ. రాజా, కె.ఎన్‌. అరుణ్‌ నెహ్రూ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement