తమిళసినిమా: నటుడు రజినీకాంత్ వరసగా చిత్రాలు నటించడంలో తగ్గేదేలే అంటున్నారు. అదే విధంగా ఆయన చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన స్టార్స్‌ను నటింపజేసే విషయంలోనూ తగ్గేదెలే అనేలా ఉంది. అలా ఇంతకుముందు రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, టాలీవుడ్ కమెడియన్ సునీల్, ఎవర్ గ్రీన్ ఐటెం సాంగ్స్ నటిగా ముద్ర వేసుకున్న తమన్నా నటించారు. దీంతో ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే అదే బాణీలు రూపొందిన రజనీకాంత్ నటించిన వెట్టయన్, కూలీ చిత్రాలు నిరాశపరిచాయి. అయినా రజనీకాంత్ అదే ఫార్మెట్లో చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. కూలీ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిధి పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ నటిస్తున్న జైలర్ –2 చిత్రంలోనూ ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. ముఖ్యంగా ఇందులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కీలకపాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు యూనిట్ వర్గాలు ప్రకటించినా, తాజాగా రజనీకాంత్, షారుఖ్ ఖాన్, ఎస్ జే.సూర్య కాంబినేషన్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్ర షూటింగ్ మరో 10 రోజుల్లో పూర్తి అవుతుందని, చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా తదుపరి రజినీకాంత్ కమలహాసన్‌తో కలిసి నటించే చిత్రానికి సిద్ధమవుతారని సమాచారం. దీనికీ నెల్సన్ దర్శకత్వం వహించనున్నారు. అదే విధంగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించే చిత్రంలోనూ రజనీకాంత్ నటించనున్నారు.


