గీవెన్స్ డేకు 465 వినతులు
తిరువళ్లూరు: కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 465 వినతులు వచ్చినట్టు జిల్లా కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. సమావేశానికి అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకాగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వేర్వేరు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ప్రతాప్‌కు వినతి పత్రం సమర్పించారు. ఇంటి పట్టాల కోసం 126 వినతులు, సాంఘిక సంక్షేమ శాఖకు 105 వినతులు, మౌలిక వసతులు కల్పించాలని 86, ఉపాధి కల్పించాలని 96 వినతులతో సహా మొత్తం 465 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ వివరించారు. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్, తక్షణం వాటిని పరిష్కరించాలని, లేకుంటే అందుకు గల కారణాలను వారికి వివరించాలని ఆదేశించారు. అనంతరం వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌డేకు హాజరై వారి నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


