అగస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
నారాయణవనం : మండలంలోని సముదాయం గ్రామంలో మరగదవళ్లీ సమేత అగస్తీశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. గురువారం ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారి నాగరాజు, అర్చకుడు రమేష్ గురుకల్ తెలిపారు. సాయంత్రం మరగదవళ్లీ, అగస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులు తిరుచ్చి వాహనంపై ఆలయ ప్రాకారంలో ఊరేగారు. అనంతరం యాగశాలలో హోమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం సముదాయం గ్రామ వీధుల్లో వాహన సేవలను నిర్వహిస్తున్నట్లు నాగరాజు తెలిపారు. మే నెల 2న శుక్రవారం సాయంత్రం సింహవానం, 3న హంస వాహనం, 4న శేషవాహనం, 5న సోమవారం నంది వాహనం, 6న గజ వాహనంపై ఉత్సవర్లు సముదాయం గ్రామ వీధుల్లో విహరిస్తారు. 7న బుధవారం రాత్రి రథోత్సవం, 8న గురువారం సాయంత్రం ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి అశ్వవాహనం, 9న శుక్రవారం ఉదయం నటరాజ ఉత్సవం, సాయంత్రం రావణేశ్వర వాహనంపై ఉత్సవర్లు విహరిస్తారు. 10న శనివారం ఉదయం కై లాసనాథ కోనలో త్రిశూల స్నానం అనంతరం సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని ఆలయ అధికారి నాగరాజు తెలిపారు.


