ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలి : కలెక్టర్
తిరువళ్లూరు: జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించడం, చెట్లు పెంపకం, పసుపు బ్యాగులను ఉపయోగించడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట కలెక్టర్ కార్యాలయంలోని ప్లాస్టిక్ వస్తువులను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్, ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించి పసుపు బ్యాగును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేదించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలనే ఉద్దేశంతోనే జనవరి నుంచి ప్రతినెలా ఒకరోజు ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటి వరకు ఆలయాలు, పుష్కరిణి, స్టేడియం, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులను ఏరివేత చేపట్టినట్లు వివరించారు. పర్యావరణానికి ముప్పుగా వున్న ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.


