అర్థవంతమైన చిన్న బడ్జెట్ చిత్రాలే చాలు
తమిళసినిమా: మీరా చిత్రానికి కథ బాధ్యతలను నిర్వహించిన ఎమ్మార్ భారతి అళియాద కోళంగళ్– 2 చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. కాగా ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం డ్రీమ్ గర్ల్. నూతన తారలు జీవ, హరీషా, ప్రభు సాస్త, ఇందిరా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని చారులత ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. సాలమన్ బోస్ చాయాగ్రహణం, ఇళమారన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు,దర్శకుడు పిసి శ్రీరామ్, వసంత్ బాలన్, అజయన్ బాల, నంద పెరియసామి, కదీర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియో ఆచరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎంఆర్ భారతి మాట్లాడుతూ మీరా చిత్రానికి కథ కథనం బాధ్యతలను నిర్వహించిన తాను ఆ తర్వాత అళియాద కోలంగళ్– 2 చిత్రానికి దర్శకత్వం వహించానన్నారు. అందులో నటి అర్చన రేవతి నాజర్ ప్రధానిపాత్రులు పోషించారని చెప్పారు.కాగా ఆ చిత్ర షూటింగ్ ను 12 రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. దాన్ని యూట్యూబ్ ఛానల్ లో లక్షలాది మంది ప్రేక్షకులు చూశారని చెప్పారు కాగా డ్రీమ్ గర్ల్ చిత్రం కోసం నాలుగు సన్నివేశాలు చిత్రీకరించాలని భావించి బయలుదేరిన తాము 16 రోజుల్లో షూటింగ్ దాదాపు పూర్తి చేసినట్లు చెప్పారు. సినిమా అనేది కష్టం కాదని అనవసరంగా శ్రమ పడకూడదన్నారు. ఛాయాగ్రాహకుడు పీసీ. శ్రీరామ్ మాట్లాడుతూ ఎమ్మార్ భారతికి తనకు మధ్య చిరకాల స్నేహం ఉందన్నారు. తమ మధ్య పలు కథలు ఉన్నాయని, తాను చెప్పిన చిన్న స్టోరీ లైన్‌కు భారతి అందమైన కథనాన్ని సిద్ధం చేశారన్నారు. ఇది సాధారణ కథాచిత్రంగా ఉండదన్నారు. ఇలాంటి చిన్న బడ్జెట్ చిత్రాలు చేస్తే చాలని, కోట్లతో భారీ బడ్జెట్ చిత్రాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని దర్శకుడు భారతికి శుభాకాంక్షలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అర్థవంతమైన చిన్న బడ్జెట్ చిత్రాలే చాలు


